ఏం స్కెచ్ రా : 5 నిమిషాల్లో.. బ్యాంక్ నుంచి రూ.14 లక్షలు కొట్టేశారు..

ఈ రోజుల్లో దొంగతనం చేయడం చాలా సింపుల్ అయిపోయింది.  దొంగలు పెద్దగా కష్టపడకుండానే లక్షలు కొట్టేస్తున్నారు. చాలా సులభంగా..అది పట్టపగలు..ప్రజలందరూ ఉండగానే డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఓ బ్యాంకులో మిట్ట మధ్యాహ్నం ..బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు ఉండగానే దొంగలు పెద్దగా కష్టపడకుండానే రూ. 14 లక్షలు ఎత్తుకెళ్లారు. కేవలం 5 నిమిషాల్లో 14 లక్షలను దోచుకెళ్లారు.  వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఆగస్టు 11వ తేదీ శుక్రవారం పట్టపగలు ఐదుగురు దొంగలు బ్యాంకును లూటీ చేశారు.  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ లోక చొరబడ్డ చోరీగాళ్లు రూ. 14 లక్షలు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి వచ్చిన దుండగులు..బైకులపై హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. అనంతరం ఆయుధాలతో బ్యాంకులోకి చొరబడ్డారు.  దొంగలు తమ వద్ద ఉన్న తుపాకులను ఉద్యోగులు, కస్టమర్లకు చూపుతూ వారిని బెదరించారు. దొంగలు బ్యాంకు కౌంటర్లలోని డబ్బును తమ బ్యాగుల్లో వేయమని సిబ్బందికి సూచించారు. 

డబ్బును బ్యాగుల్లో వేసిన తర్వాత బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను దొంగలు ఓ గదిలో బంధించారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ తతంగమంతా జరగడంతో బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు షాక్ కు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి సీసీ టీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. సూరత్ అంతా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.