
అహ్మదాబాద్: సాయి సుదర్శన్ (41 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) మెరుపు బ్యాటింగ్‌కు తోడు ప్రసిధ్ కృష్ణ (2/18), మహ్మద్ సిరాజ్ (2/34) సత్తా చాటడంతో ఐపీఎల్18లో గుజరాత్ టైటాన్స్ బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో జీటీ 36 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది.
సుదర్శన్‌తో పాటు జోస్ బట్లర్ (24 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 39), శుభ్‌మన్ గిల్ (27 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38) రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 160/6 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (28 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 48), తిలక్ వర్మ (36 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 39) మాత్రమే పోరాడారు. ప్రసిధ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
సుదర్శన్ మెరుపులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన జీటీకి ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేశారు. తొలి ఓవర్లోనే ఫోర్‌తో గిల్ బౌండ్రీల ఖాతా తెరవగా.. బౌల్ట్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో సుదర్శన్ టచ్‌లోకి వచ్చాడు. ఐదో ఓవర్లో స్పిన్నర్ ముజీబ్ 4,6తో స్వాగతం పలికాడు. దీపక్ చహర్ బౌలింగ్‌లో గిల్ 6, 4 కొట్టడంతో జీటీ పవర్ ప్లేను 66/0 స్కోరుతో ముగించింది. పవర్ ప్లే తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కు దిగడంతో జీటీ జోరుకు ముకుతాడు పడింది.
తన రెండో ఓవర్లో నమన్ ధీర్ క్యాచ్‌తో గిల్‌ను ఔట్ చేసిన పాండ్యా తొలి వికెట్‌కు 78 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ నెమ్మదించగా.. శాంట్నర్ బౌలింగ్‌లో 6, 4, హార్దిక్ ఓవర్లో ఫోర్ కొట్టిన జోస్ బట్లర్ స్కోరు వంద దాటించాడు. అయితే, భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన అతడిని 14వ ఓ వర్లో ముజీబ్ క్యారమ్ బాల్‌తో ఔట్ చేశాడు. సుదర్శన్ 33 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. షారూక్ ఖాన్ (9) నిరాశపరిచాడు.
కానీ, సత్య నారాయణ రాజు వేసిన 17వ ఓవర్లో రూథర్‌ఫొర్డ్ (18 ), సుదర్శన్ చెరో సిక్స్ బాదడంతో ఇన్నింగ్స్‌లో మళ్లీ జోష్ పెరిగింది. ఈ ఇద్దరూ క్రీజులో ఉండటంతో జీటీ ఈజీగా 220 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, చివరి మూడు ఓవర్లలో ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. బౌల్ట్ బౌలింగ్‌లో సుదర్శన్ ఎల్బీ అవ్వగా.. చహర్ ఓవర్లో రాహుల్ తెవాటియా (0), రూథర్‌ఫోర్డ్ వెనుదిరిగారు. రాజు వేసిన ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ (6) సిక్స్ కొట్టి ఔటవగా.. లాస్ట్ బాల్‌కు సాయి కిశోర్ (1) రనౌటయ్యాడు.
సూర్య, తిలక్ పోరాడినా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ముంబైకి తొలి ఓవరల్లోనే షాక్ తగిలింది. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ (8)ను సిరాజ్ అద్భుతమైన బాల్‌తో బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ.. రబాడ వేసిన రెండో ఓవర్లో 4 , 4, 6తో హిట్టింగ్ చేశాడు. కానీ, మరో ఎండ్‌లో తడబడుతున్న ఓపెనర్ రికెల్టన్ (6)ను కూడా ఐదో ఓవర్లో సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ ఎదుర్కొన్న రెండో బాల్‌కే సిక్స్ కొట్టాడు. ఆరో ఓవరలో స్పిన్నర్ రషీద్ నాలుగు రన్సే ఇవ్వగా.. పవర్ ప్లేను ముంబై 48/2తో ముగించింది.
మిడిల్ ఓవర్లలో సూర్య, తిలక్ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ, క్రీజులో కుదురుకున్న తిలక్‌ను 12వ ఓవర్లో ప్రసిధ్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రాబిన్ మింజ్ (3) ఫెయిలయ్యాడు. సాయి కిశోర్, ప్రసిధ్ కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో సూర్య, కెప్టెన్ హార్దిక్ (17 బాల్స్‌లో11) షాట్లు ఆడలేకపోయారు.
దాంతో సాధించాల్సిన రన్‌రేట్ అమాంతం పెరిగింది. ప్రసిధ్ బౌలింగ్‌లో సూర్య కూడా వెనుదిరిగడంతో మ్యాచ్ జీటీ చేతుల్లోకి వెళ్లింది. ఆదుకుంటాడని అనుకున్న హార్దిక్.. రబాడ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ముంబై ఓటమి ఖాయమైంది.
స్కోర్‌బోర్డ్
గుజరాత్ టైటాన్స్:సాయి సుదర్శన్ (ఎల్బీ) బౌల్ట్ 63, గిల్ (సి) నమన్ ధీర్ (బి) పాండ్యా 38, జోస్ బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్39, షారుఖ్ ఖాన్ (సి) తిలక్ వర్మ (బి) పాండ్యా 9, రూథర్‌ఫోర్డ్ (సి) శాంట్నర్ (బి) చహర్ 18, రాహుల్ తెవాటియా (రనౌట్/ పాండ్యా) 0, రషీద్ ఖాన్ (సి) పాండ్యా (బి) రాజు 6, రబాడ (నాటౌట్) 7, సాయి కిషోర్ (రనౌట్/రికెల్టన్) 1, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 196/8; వికెట్ల పతనం: 1-–78, 2–-129, 3-–146, 4-–179, 5–-179, 6-–179, 7–-194, 8-–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–-0–-34–-1, దీపక్ చహర్ 4–-0–-39-1, ముజీబ్ 2-–0-–28–-1, హార్దిక్ పాండ్యా 4-–0-–29–-2, మిచెల్ శాంట్నర్ 3–-0–-25–-0, సత్యనారాయణ రాజు 3-–0-–40–-1.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (బి) సిరాజ్ 8, ర్యాన్ రికెల్టన్ (బి) సిరాజ్ 6, తిలక్ వర్మ (సి ) తెవాటియా (బి) ప్రసిద్ధ్ కృష్ణ 39, సూర్య కుమార్( సి) శుభ్‌మన్ గిల్ (బి) ప్రసిద్ధ్ కృష్ణ 48, రాబిన్ మింజ్ (సి) ఇషాంత్ శర్మ (బి) సాయి కిషోర్ 3, హార్దిక్ పాండ్యా (సి ) సిరాజ్ (బి)రబాడ 11, నమన్ ధీర్( నాటౌట్) 18, శాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం: 20 ఓవర్లలో 160/6; వికెట్ల పతనం: 1–-8, 2–-35, 3–97 , 4–108 , 5–120, 6-–124; బౌలింగ్: సిరాజ్ 4– 0– 34– 2, కగిసో రబాడ 4 –0 –42– 1, ఇషాంత్ శర్మ 2– 0– 17– 0, రషీద్ ఖాన్ 2 –0 –10– 0, సాయి కిషోర్ 4– 0– 37– 1, ప్రసిద్ధ్ కృష్ణ 4– 0– 18 –2.