జీటీ అవుతుందా  మళ్లీ మేటి మరో 5 ఐపీఎల్ 18 

జీటీ అవుతుందా  మళ్లీ మేటి మరో 5 ఐపీఎల్ 18 

వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌‌లోనే చాంపియన్‌‌గా నిలిచి, తర్వాతి ఏడాదీ ఫైనల్‌‌ చేరుకుని ఐపీఎల్‌‌లో అందరి దృష్టిని ఆకర్షించిన టీమ్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌(జీటీ). అంతే అనూహ్యంగా తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదులుకొని 2024లో బరిలోకి దిగిన జీటీ ఆ  జోరు కొనసాగించలేకపోయింది. శుభ్‌‌మన్ గిల్ కెప్టెన్సీలో కనీసం ప్లే ఆఫ్స్‌‌ కూడా చేరలేక డీలా పడింది.  దాంతో2025 కోసం తమ జట్టును పునర్నిర్మించుకుంది. గిల్ నాయకత్వంలో మరో టైటిల్ నెగ్గాలని చూస్తోంది

బలాలు

గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌‌  కోసం అద్భుతమైన బౌలింగ్ విభాగాన్ని సిద్ధం చేసుకుంది. వరల్డ్ టాప్ టీ20 స్పిన్నర్‌‌  రషీద్ ఖాన్‌‌ను రిటైన్ చేసుకోవడంతో పాటు కగిసో రబాడ, గెరాల్డ్ కోయెట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్‌‌ కృష్ణ, ఇషాంత్ శర్మ వంటి మేటి పేసర్లను జట్టులోకి తీసుకుంది.  అనుభవం, యువ బలంతో కూడిన జీటీ బౌలింగ్ లీగ్‌‌లో అత్యంత  పవర్‌‌‌‌ఫుల్‌‌గా కనిపిస్తోంది.

 గత సీజన్‌‌లో అత్యుత్తమంగా రాణించిన గిల్,  సాయి సుదర్శన్‌‌ జోడీకి తోడు జోస్ బట్లర్ చేరికతో టాపార్డర్ మరింత బలోపేతం అయింది. ఈ ముగ్గురు సత్తా చాటితే టైటాన్స్ భారీ స్కోర్లు చేయగలరు. రషీద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్,  రాహుల్ తెవాటియా వంటి విభిన్న ఆల్-రౌండర్ల ఉండటం జీటీ తుది జట్టు లోతును పెంచే విషయం. పవర్‌‌‌‌ప్లేలోనూ బౌలింగ్ చేయగల సుందర్‌‌‌‌, మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసే రషీద్ జీటీ బౌలింగ్‌‌కు ప్రధాన ఆయుధాలు. మొత్తంగా జీటీ ఆల్‌‌రౌండ్‌‌ ప్యాకేజీతో కొత్త సీజన్‌‌కు సిద్ధమైంది.

 బలహీతన

బ్యాటింగ్‌‌లో గిల్, బట్లర్, సుదర్శన్‌‌పై అతిగా ఆధారపడటం ప్రధాన సమస్యగా మారవచ్చు. వీళ్లు రాణించకపోతే జట్టు డీలా పడే అవకాశం ఉంది. అలాగే, అనుభవజ్ఞులైన ఫినిషర్లు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారొచ్చు. చెప్పుకోదగ్గ ఇండియన్ బ్యాటర్లు కూడా కనిపించడం లేదు.

లోమ్రోర్, అనుజ్,  కుమార్, కుషాగ్ర వంటి ఆటగాళ్ళు తమ సత్తాను నిరూపించున్నప్పటికీ వాళ్లకు అంతగాఅనుభవం లేదు. మిడిలార్డర్‌‌  రాణించకపోతే టాపార్డర్‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతుంది.  దీని ఫలితంగా కీలకమైన మ్యాచ్‌‌ల్లో బ్యాటింగ్ కుప్పకూలిపోవచ్చు. పేసర్లు  ప్రసిధ్‌‌, ఇషాంత్,  రబాడ తరచూ గాయాలకు గురవుతుంటారు. ఈ కారణంగా గుజరాత్ ఫిట్‌‌నెస్ సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

అవకాశం

అన్ని విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ సమష్టిగా రాణిస్తేనే జీటీ మళ్లీ చాంపియన్‌‌గా నిలవగలదు. సుదర్శన్, సుందర్,  ప్రసిధ్‌‌ వంటి యంగ్‌‌స్టర్లు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఈ సీజన్‌‌ గొప్ప అవకాశాన్ని ఇవ్వనుంది. ఈ సీజన్‌‌లో మెరిస్తే నేషనల్‌‌ టీమ్‌‌లో తమ స్థానాలను బలోపేతం చేసుకోవచ్చు.

ఈ సీజన్‌‌ గిల్ కెప్టెన్సీకి కూడా కీలకం కానుంది. తను ఈ మధ్యే ఇండియా (వన్డే) టీమ్ వైస్ కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. భవిష్యత్తులో సుదీర్ఘకాలం జట్టును నడిపించే సత్తా తనకు ఉందని సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు నమ్ముతున్నారు. ఎంతో పోటీ ఉండే ఐపీఎల్‌‌లో ట్రోఫీ అందుకుంటే నాయకుడిగా గిల్ మరో మెట్టు ఎక్కుతాడు.  

 గుజరాత్ టైటాన్స్ జట్టు

బ్యాటర్లు: శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, షారూక్ ఖాన్, మహిపాల్ లోమ్రోర్; ఫాస్ట్ బౌలర్లు: రబాడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కుల్వంత్ ఖెజ్రోలియా; ఆల్ రౌండర్లు: రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షెర్ఫానె రూధర్‌‌ఫోర్డ్, కరీమ్ జనాట్, నిశాంత్ సిందు, మానవ్ సుతార్;  కీపర్లు: జోస్ బట్లర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్:  స్పిన్నర్లు: రషీద్ ఖాన్, జయంత్ యాదవ్