విలియంసన్, రషీద్ ఖాన్‌కు నో ఛాన్స్.. గుజరాత్ కొత్త కెప్టెన్‪గా టీమిండియా యువ సంచలనం

విలియంసన్, రషీద్ ఖాన్‌కు నో ఛాన్స్.. గుజరాత్ కొత్త కెప్టెన్‪గా టీమిండియా యువ సంచలనం

ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కు  కొత్త కెప్టెన్ గా సెలక్ట్ చేశారు. 2022 లో తొలిసారి ఐపీఎల్ లు పరిచయమైన రెండు కొత్త జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. 2022, 2023 సంవత్సరాల్లో హార్దిక్ పాండ్య  గుజరాత్ జట్టును సమర్ధవంతంగా నడిపించాడు.అయితే నిన్న(నవంబర్ 26) జరిగిన ట్రేడింగ్ ద్వారా హార్దిక్ గుజరాత్ నుంచి ముంబైకి వెళ్లిపోవడంతో గుజరాత్ యాజమాన్యం యువ సంచలనం గిల్ మీద నమ్మకముంచి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 

గుజరాత్ జట్టులో విలియంసన్, రషీద్ ఖాన్ లాంటి సీనియర్ ప్లేయర్ లు ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గిల్ వైపే మొగ్గు చూపారు. 2022 లో గుజరాత్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన గిల్.. 2023లో అత్యధిక పరుగులు(890) చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిల్ గతంలో అండర్-19 భారత జట్టుకు వైస్ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. బ్యాటర్ గా, కెప్టెన్ గా 2024 ఐపీఎల్ లో ద్విపాత్రాభినయం పోషించడానికి గిల్ సిద్ధంగా ఉన్నాడు. 

ఇక గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లోనే విజయవంతమైన జట్లలో ఒకటి. హార్దిక్ సారధ్యంలోని గుజరాత్ జట్టు 2022లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసింది. ఆడిన తొలి సీజన్ లోనే అన్ని జట్లకు షాకిస్తూ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక 2023 లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ వరకు వచ్చి చెన్నై చేతిలో ఓడింది. ఐపీఎల్ 2024లో హార్దిక్ లేకున్నా షమీ, విలియంసన్, రషీద్ ఖాన్, గిల్, మిల్లర్ లతో గుజరాత్ పటిష్టంగా కనిపిస్తుంది.