సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ సూపర్ బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. పవర్ ప్లేలో ముంబై బౌలర్ల దాటికి వెనకడుగేసింది. మిడిల్ ఓవర్లలో పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది.
పడిపోతున్న గుజరాత్ ఇన్నింగ్స్ ను ఓపెనర్ శుభ్ మన్ గిల్ (56, 34 బంతుల్లో) కాపాడాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13,14 బంతుల్లో), విజయ్ శంకర్ (19, 16 బంతుల్లో) క్రీజులో ఎక్కువసేపు నిల్వలేకపోయారు.
మిడిల్ ఆర్డర్ లో వచ్చిన డేవిడ్ మిల్లర్ (46, 20 బంతుల్లో), అభినవ్ మనోహర్ (42, 21 బంతుల్లో) రెచ్చిపోయి ఆడారు. దాంతో గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో రాహుల్ తివాటియా (20, 5 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో గుజరాత్ 207 పరుగులకు చేరుకోగలిగింది.
ముంబై బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ పవర్ ప్లేలో రెచ్చిపోయాడు. రెండు ఓవర్లు వేసి 9 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జేసన్, మెరిడిత్, కార్తికేయ చెరో వికెట్ పడగొట్టారు. పియూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి.