RCB Vs GT: ఆర్సీబీపై నిప్పులు చెరిగిన సిరాజ్.. గుజరాత్ ముందు ఓ మాదిరి లక్ష్యం

RCB Vs GT: ఆర్సీబీపై నిప్పులు చెరిగిన సిరాజ్.. గుజరాత్ ముందు ఓ మాదిరి లక్ష్యం

చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో అంచనాలకు తగ్గటు రాణించలేకపోయింది. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్ (32) పర్వాలేదనిపించగా మిగిలినవారు విఫలమయ్యారు. మరోవైపు గుజరాత్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54: ఫోర్, 5 సిక్సర్లు) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీలు మంచి ఆరంభం లభించలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ రెండో ఓవర్ లోనే ఔటయ్యాడు. స్వేర్ లెగ్‎లో షాట్‎కు యత్నించి యంగ్ బౌలర్ అర్షద్ ఖాన్ బౌలింగ్‎లో వికెట్ సమర్పించుకున్నాడు.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించినా మహ్మద్ సిరాజ్ బౌలింగ్‎లో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టిన సాల్ట్.. ఆ తర్వాత బంతికే సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. 

కెప్టెన్ పటిదార్ కూడా ఎక్కువగా క్రీజ్ లో నిలవలేకపోయాడు. 12 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‎లో ఎల్బీ రూపంలో ఔట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 42 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాదహ్యతను జితేష్ కుమార్, లివింగ్ స్టోన్ తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలిబెట్టారు. ఐదో వికెట్ కు 52 పరుగులు జోడించిన తర్వాత జితేష్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాసేపటికీ 5 పరుగులు చేసి క్రునాల్ పాండ్య వెనుదిరిగాడు. 

ఈ దశలో బెంగళూరు కుప్పకూలుతుందేమో అనుకున్నారు. అయితే లివింగ్ స్టోన్(54), టిమ్ డేవిడ్ చెలరేగడంతో గౌరవప్రథమమైన స్కోర్ చేసింది. ప్రసిద్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు రావడంతో ఆర్సీబీ ఫైటింగ్ టోటల్ బోర్డు మీద ఉంచింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్ , ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.