KKR vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపిన గిల్.. కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్

KKR vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపిన గిల్.. కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్

సోమవారం (ఏప్రిల్ 21) కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ధనాధన్ బ్యాటింగ్ తో మెప్పించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదట బ్యాటింగ్ చేసి ఆతిధ్య కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్ ను సెట్ చేసింది. ఓపెనర్లు శుభమాన్ గిల్ (55బంతుల్లో 90:10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాటు సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52:6 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన గిల్ 90 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా తలో వికెట్ తీసుకున్నాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఎలాంటి భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే లో వీరిద్దరి ధాటికి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే పవర్ ప్లే తర్వాత వీరిద్దరూ గేర్ మార్చారు. 7 ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్ లో గిల్ వరుసగా 6,4,4 కొట్టి 17 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్ లో సుదర్శన్ కూడా బ్యాట్ ఝులిపించడంతో స్కోర్ వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో గిల్, సాయి సుదర్శన్ ఒకే ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

11 ఓవర్లో మొదట గిల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటే.. ఇదే ఓవర్లో చివరి బంతికి సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. 13 ఓవర్ రెండో బంతికి రస్సెల్ సుదర్శన్ వికెట్ తీసి బ్రేక్ ఇచ్చినా.. బట్లర్ (41), గిల్ ఇద్దరూ చివర్లో మెరుపులు మెరిపించారు. తొలి 10 ఓవర్లలో 89 పరుగులు చేసిన గుజరాత్.. చివరి 10 ఓవర్లలో 99 పరుగులు రాబట్టింది.