RR vs GT: మరోసారి దంచికొట్టిన ముగ్గురు మొనగాళ్లు.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!

RR vs GT: మరోసారి దంచికొట్టిన ముగ్గురు మొనగాళ్లు.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!

ఐపీఎల్ 2025లో గుజరాత్ టాపార్డర్ మరోసారి అదరగొట్టింది.ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ (84), సాయి సుదర్శన్(39), బట్లర్ (50) మరోసారి మెరిశారు. జైపూర్ లో సోమవారం (ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ త్రయం అదరగొట్టడడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ గిల్ (50 బంతుల్లో 84:5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఎప్పటిలాగే ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో జాగ్రత్తగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత అదే జోరు కొనసాగించడంతో తొలి 10 ఓవర్లలో 92 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. 11 ఓవర్ రెండో బంతికి సాయి సుదర్శన్ ను ఔట్ చేసి తీక్షణ రాజస్థాన్ కు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో బట్లర్ తో కలిసి గిల్ మెరుపులు మెరిపించాడుమరో ఎండ్ లో బట్లర్ కూడా దంచి కొట్టడంతో స్కోర్ వేగంగా ముందుకు కదిలింది. 

ఈ క్రమంలో గిల్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హసరంగా వేసిన 15 ఓవర్లో బట్లర్ విజృంభించడంతో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్ లో సెంచరీ మిస్ చేసుకున్న గిల్.. ఈ సారి 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్న బట్లర్ 26 బంతుల్లోనే 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. తొలి 10 ఓవర్లలో 92 పరుగులు చేసిన గుజరాత్.. చివరి 10 ఓవర్లలో 117 పరుగులు రాబట్టింది.