ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వరుస పరాజయాల తర్వాత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై చెన్నైపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 35 పరుగుల తేడాతో గుజరాత్ కీలక విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులకు పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
232 పరుగుల లక్ష్య ఛేదనలో సూపర్ కింగ్స్ కు చెత్త ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే రచీన్ రవీంద్ర (1) దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో రహానే (1) సందీప్ వారియర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. అసలే రెండు వికెట్లు పడి కష్టాల్లో ఉంటే ఫామ్ లో ఉన్న గైక్వాడ్ డకౌటయ్యాడు. ఈ దశలో మొయిన్ అలీ( 56, 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) డారిల్ మిచెల్( 63, 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) జట్టును ఆదుకున్నారు. మొదట్లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా బ్యాట్ ఝళిపించారు. పవర్ ప్లే తర్వాత గుజరాత్ బౌలర్లపై మరింతగా చెలరేగారు. బౌండరీల వర్షం కురిపిస్తూ లక్ష్యం దిశగా తీసుకెళ్లారు.
హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీదున్న మిచెల్, మొయిన్ అలీలను మోహిత్ శర్మ అవుట్ చేయడంతో చెన్నై లక్ష్య ఛేదనలో వెనకపడింది. కొట్టాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో దూబే (21), జడేజా (18), ధోనీ (26) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్( 51 బంతుల్లో 103, 5 ఫోర్లు, 7 సిక్సులు) శుభమాన్ గిల్ (55 బంతుల్లో 104, 9 ఫోర్లు, 6 సిక్సులు) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండేకు రెండు వికెట్లు దక్కాయి.
Gujarat Titans keep themselves and RCB in the contest for IPL Playoffs. pic.twitter.com/vwmTAMbfD4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024