GT vs MI: చెలరేగిన సాయి సుదర్శన్, సిరాజ్.. ముంబైపై గుజరాత్ ఘన విజయం

GT vs MI: చెలరేగిన సాయి సుదర్శన్, సిరాజ్.. ముంబైపై గుజరాత్ ఘన విజయం

ఐపీఎల్ సీజన్ 18 లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. శనివారం (మార్చి 29) అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ అదరగొట్టడంతో పాటు బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది.      

197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆరంభించింది. రోహిత్ శర్మ రెండు ఫోర్లు కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. అయితే హిట్ మ్యాన్ వేగానికి సిరాజ్ వెంటనే బ్రేకులు వేశాడు. తొలి ఓవర్ ఐదో బంతికి ఒక అద్భుతమైన ఇన్ స్వింగ్ తో రోహిత్ ను బౌల్డ్ చేశాడు. ఇదే ఊపులో సిరాజ్ రికెల్టను బోల్డ్ చేసి మంచి గుజరాత్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. 
ఈ దశలో ముంబైని సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ పరిస్థితిని చక్కదిద్దారు. 

మూడో వికెట్ కు 62 పరుగులు జోడించిన తర్వాత కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో భారీ షాట్ ఆడి తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడ నుంచి గుజరాత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో ముంబై ఒత్తిడిలో పడింది. యువ బ్యాటర్ రాబిన్ మింజ్ అవుట్ కావడంతో ముంబైగా నాలుగో వికెట్ కోల్పోయింది. అప్పటికే కొట్టాల్సిన రన్ రేట్ 14 ఉండడంతో సూర్య కుమార్, హార్దిక్ పాండ్య సైతం ఏమీ చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. రబడా, సాయి కిషోర్ లకు తలో వికెట్ లభించింది. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63 పరుగులు: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గిల్(38), బట్లర్ (39) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య 2 వికెట్లు తీసుకున్నాడు. బోల్ట్, చాహర్, ముజీబ్, సత్యనారాయణ తలో వికెట్ పడగొట్టారు.