KKR vs GT: గుజరాత్ ఖాతాలో మరో విజయం.. భారీ ఛేజింగ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో ఓడిన కోల్‌కతా

KKR vs GT: గుజరాత్ ఖాతాలో మరో విజయం.. భారీ ఛేజింగ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో ఓడిన కోల్‌కతా

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 21) కోల్‌కతా నైట్ రైడర్స్ పై మరో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిధ్య కేకేఆర్ ను చిత్తు చేస్తూ 39 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో అదరగొట్టిన గిల్ సేన.. తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి ఈ సీజన్ లో ఆరో విక్టరీ కొట్టింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

199 పరుగుల ఛేజింగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ లోనే ఓపెనర్ గుర్బాజ్(1) ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఈ దశలో రహానే, నరైన్ కాసేపు బ్యాట్ ఝుళిపించారు. ఐదో ఓవర్లో నరైన్(17) ఔట్ కావడంతో కేకేఆర్ పరుగుల వేగం పూర్తిగా మందగించింది. రహానే, వెంకటేష్ అయ్యర్ పవర్ ప్లే తర్వాత పరుగులు చేయడంలో బాగా తడబడ్డారు. ఉన్నంత సేపు క్రీజ్ లో ఇబ్బందిపడిన అయ్యర్ 19 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. 

Also Read : గిల్ అందానికి మోరిసన్ ఫిదా

36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే కాసేపటికే స్టంపౌటయ్యాడు. రావడంతోనే 4, 6 కొట్టి ఊపు మీద కనిపించిన రస్సెల్ ఆ తర్వాత తేలిపోయాడు. ఇక రింకూ సింగ్ సింగిల్స్ తప్ప బౌండరీ బాదడంలో విఫమలయ్యాడు. ఓ వైపు కొట్టాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా.. గుజరాత్ బౌలర్ల ధాటికి కేకేఆర్ బ్యాటర్లు ఏ దశలోనూ దూకుడుగా ఆడడంలో విఫలమయ్యారు. రస్సెల్ ఔటైన తర్వాత రమణ్ దీప్ సింగ్(1) , మొయిన్ అలీ(0) పెవిలియన్ కు క్యూ కట్టారు. చివర్లో రఘువంశీ(27), రింకూ సింగ్(17) కాస్త మెరుపులు మెరిపించినా అప్పటికే కేకేఆర్ ఓటమి ఖాయమైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సుందర్, సిరాజ్,సాయి కిషోర్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. 

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు శుభమాన్ గిల్ (55బంతుల్లో 90:10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాటు సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52:6 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన గిల్ 90 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా తలో వికెట్ తీసుకున్నాడు.