GT vs RR: గుజరాత్ చేతిలో రాజస్థాన్ చిత్తు.. గిల్ సేనకు వరుసగా నాలుగో విజయం

GT vs RR: గుజరాత్ చేతిలో రాజస్థాన్ చిత్తు.. గిల్ సేనకు వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ 2025లో గుజరాత్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న గిల్ సేన.. బుధవారం (ఏప్రిల్ 9) రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82: 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. 

218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ జైశ్వాల్ (6), నితీష్ రానా (1) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పరాగ్ మూడు సిక్సర్లతో మంచి ఊపు మీద కనిపించాడు. పవరే ప్లే లో 57 పరుగులు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఉన్నంత సేపు సిక్సర్లతో హోరెత్తించిన పరాగ్.. కీపర్ (26) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే ధృవ్ జురెల్ 5 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఒకవైపు వికెట్లు పడుతున్నా సంజు శాంసన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. హెట్ మేయర్ తో కలిస్ మెరుపులు మెరిపించాడు. మరో ఎండ్ లో హెట్ మేయర్ కూడా బౌండరీల వర్షం కురిపించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 41 పరుగులు చేసిన తర్వాత శాంసన్ ఔట్ కావడంతో మ్యాచ్ పై రాజస్థాన్ ఆశలు వదిలేసుకుంది. శాంసన్ ఔటైన తర్వాత హెట్ మేయర్ (32 బంతుల్లో 52) కాసేపు మెరుపులు మెరిపంచినా అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్, సాయి కిషోర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఖేజ్రోలియా, సిరాజ్, అర్షద్ ఖాన్ లకు తలో వికెట్ దక్కింది. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82: 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీకి తోడు బట్లర్ (36), షారుఖ్ ఖాన్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.