RCB Vs GT: బట్లర్ హోరు, సిరాజ్ జోరు.. బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం

RCB Vs GT: బట్లర్ హోరు, సిరాజ్ జోరు.. బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం

ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం (ఏప్రిల్ 2) చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో సిరాజ్ నిప్పులు చెరగగా..ఆ తర్వాత ఛేజింగ్ లో బట్లర్( 39 బంతుల్లో 73:5 ఫోర్లు, 6 సిక్సర్లు) సాయి సుదర్శన్ (49) బ్యాటింగ్ లో అదరగొట్టారు. ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆర్సీబీ తొలి పరాజయాన్ని మూట కట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. 

ALSO READ | RCB Vs GT: రివెంజ్ అదిరింది: సిరాజ్ స్టన్నింగ్ డెలివరీకి సాల్ట్ క్లీన్ బౌల్డ్!

170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. భువనేశ్వర్ కుమార్, హేజల్ వుడ్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి నాలుగు ఓవర్లలో 26 పరుగులు మాత్రమే చేసింది. భువీ వేసిన ఐదో ఓవర్లో సిక్సర్ కొట్టిన గిల్ (14) ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. ఈ దశలో గుజరాత్ ఇన్నింగ్స్ ను బట్లర్, సాయి సుదర్శన్ ముందుకు తీసుకెళ్లారు. ఎలాంటి తడబాటు లేకుండా బెంగళూరు బౌలర్లను అలవోకగా ఆడేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. 

బట్లర్ తో కలిసి రెండో వికెట్ కు 75 పరుగులు జోడించిన తర్వాత 49 పరుగులు చేసి సుదర్శన్ ఔటయ్యాడు. అప్పటికే క్రీజ్ లో సెట్ అయినా బట్లర్ ఈ క్రమంలో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రూథర్ ఫోర్డ్ తో కలిసి మ్యాచ్ ను వేగంగా ముగించాడు. మరో ఎండ్ లో రూథర్ ఫోర్డ్ 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి బట్లర్ కు చక్కని సహకారం అందించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజల్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు. 

అంతకముందు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్  చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో అంచనాలకు తగ్గటు రాణించలేకపోయింది. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్ (32) పర్వాలేదనిపించగా మిగిలినవారు విఫలమయ్యారు. మరోవైపు గుజరాత్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54: ఫోర్, 5 సిక్సర్లు) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్ , ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.