- చెలరేగిన బెత్ మూనీ, లారా
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన గుజరాత్ జెయింట్స్.. డబ్ల్యూపీఎల్‌లో ఎట్టకేలకు బోణీ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ (85 నాటౌట్), లారా వోల్‌వర్త్ (76) చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 19 రన్స్ తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ నెగ్గిన గుజరాత్ 20 ఓవర్లలో 199/5 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 180/8 స్కోరుకే పరిమితమైంది. జార్జియా వారెహామ్ (48) టాప్ స్కోరర్.
ఛేజింగ్‌లో కెప్టెన్ స్మృతి మంధాన (24) వేగంగా ఆడినా, మేఘన (4) ఫెయిలైంది. ఈ దశలో పెర్రీ (24), సోఫీ డివైన్ (23) మూడో వికెట్‌కు 34 రన్స్ జత చేశారు. మిడిలార్డర్‌లో రిచా ఘోష్ (30) ఫర్వాలేదనిపించింది. పెర్రీతో నాలుగో వికెట్‌కు 20, వారెహామ్‌తో ఐదో వికెట్‌కు 33 రన్స్ జత చేసింది. చివర్లో వేగంగా ఆడిన వారెహామ్.. సోఫీ మోలినెక్స్ (3)తో ఆరో వికెట్‌కు 16 బాల్స్‌లోనే 34 రన్స్ జోడించినా విజయాన్ని అందించలేకపోయింది. మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఓపెనర్లు అదుర్స్
తొలి ఓవర్‌లో లారా రెండు ఫోర్లతో ఖాతా తెరిస్తే, మూనీ ఫోర్‌తో టచ్‌లోకి వచ్చింది. మూడో ఓవర్‌లో చెరో ఫోర్‌తో జోరు పెంచారు. ఇక్కడి నుంచి వరుసపెట్టి ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 59/0 స్కోరు చేసింది. బెంగళూరు బౌలింగ్‌లో పస లేకపోవడంతో భారీ షాట్లకు వీళ్లు తెరలేపారు. 8, 9 ఓవర్లలో మూనీ 4 ఫోర్లు కొట్టింది. 10వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన లారా 32 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసింది. ఫస్ట్ టెన్‌లో జీజీ 104/3 స్కోరు చేసింది.
ఇక్కడి నుంచి మూనీ సింగిల్స్‌తో పాటు ఓవర్‌కు ఓ ఫోర్ బాదుతూ 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకుంది. 13వ ఓవర్‌లో లారా రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 140 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌కు బ్రేక్ పడింది. లిచ్‌ఫీల్డ్ (18) అండతో మూనీ 6, 4, 4తో రన్‌రేట్ పెంచింది. వేగంగా సింగిల్స్ తీసిన లిచ్‌ఫీల్డ్ ఓ ఫోర్‌తో కుదురుకుంది. కానీ 19వ ఓవర్‌లో గుజరాత్‌కు డబుల్ ఝలక్ తగిలింది. రెండో వికెట్‌కు 52 రన్స్ జోడించి లిచ్‌ఫీల్డ్ వెనుదిరిగింది. తర్వాతి బాల్‌కే గార్డ్‌నర్ (0) కూడా ఔట్ కావడంతో స్కోరు 192/3గా మారింది. ఆఖరి ఓవర్‌లో హేమలత (1), వేదా కృష్ణమూర్తి (1) వికెట్లు పడినా గుజరాత్ భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.