పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అందుకే ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. పెళ్లిళ్ల విషయంలో ఈ మధ్యకాలంలో వింతలు చాలానే చూస్తున్నాం. కొందరు సేమ్ జెండర్ మ్యారేజ్లు చేసుకుంటే మరికొందరు వస్తువులు, చెట్లను పెళ్లాడుతున్నారు. కానీ గుజరాత్కు చెందిన ఓ యువతి మాత్రం తనను తానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది.
జపాన్ లో సోలో వెడ్డింగ్స్ కామన్. కానీ ఇండియాలో ఇప్పటి వరకు అలాంటి పెళ్లిళ్లు జరగలేదు. తాజాగా గుజరాత్ బరోడాకు చెందిన 24ఏళ్ల క్షమ బిందు తనను తానే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. జూన్ 11న బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్దంగా అంగరంగ వైభవంగా తనను తాను వివాహమాడాలని నిశ్చయించుకుంది. ఈ పెళ్లిలో వరుడు, బరాత్ ఉండదు తప్ప మిగిలిన ఆచారాలన్నీ పాటించాలని డిసైడ్ చేసుకుంది. పెద్దలను ఒప్పించి మరీ తాను సోలో వెడ్డింగ్ కు సిద్ధమైనట్లు బిందు చెబుతోంది.
"నాకు పెళ్లిచేసుకోవడం ఇష్టం లేకపోయినా వధువుగా ముస్తాబవ్వాలని ఉంది. అందుకే నన్ను నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా".
ఇండియాలో ఇలాంటి పెళ్లిళ్లు ఇప్పటి వరకు జరగలేదు. బిందు కూడా ఇంటర్నెట్లో సోలో వెడ్డింగ్ గురించి వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదని, బహుశా దేశంలో తనను తానే చేసుకునే మొదటి వ్యక్తి తానే కావచ్చని అంటోంది. హల్దీ, మెహందీ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించిన అనంతరం గోత్రిలోని దేవాలయంలో వివాహం జరపనున్నారు. పెళ్లైన తర్వాత బిందు గోవాలో రెండు వారాల హనీమూన్ ప్లాన్ చేసుకుంది.