బెంగళూరుపై గుజరాత్ గెలిచింది కానీ.. అదొక్కటే డిజప్పాయింట్మెంట్

బెంగళూరుపై గుజరాత్ గెలిచింది కానీ.. అదొక్కటే డిజప్పాయింట్మెంట్
  • బెంగళూరుకు భంగపాటు
  • 8  వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్‌‌ టైటాన్స్‌
  • రాణించిన సిరాజ్‌‌, బట్లర్‌‌‌‌, సుదర్శన్‌‌

బెంగళూరు: వరుసగా రెండు భారీ విజయాలతో  ఊపు మీదున్న రాయల్ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్సీబీ) జోరుకు బ్రేక్‌‌.  సొంతగడ్డపై తొలి పోరులో ఆర్సీబీ నిరాశపరిచింది. తమ మాజీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ (3/18) చిన్నస్వామి స్టేడియంలో  బెస్ట్ బౌలింగ్‌‌తో,  జోస్ బట్లర్  (39 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్‌‌) మెరుపు బ్యాటింగ్‌తో దెబ్బకొట్టడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. 

లియాన్ లివింగ్‌‌స్టోన్ (40 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 5 సిక్సర్లతో 54) ఫిఫ్టీతో రాణించగా.. జితేష్ శర్మ (21బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33), టిమ్ డేవిడ్ (18 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించారు. జీటీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం జీటీ 17.5 ఓవర్లలోనే 170/2 స్కోరు చేసి వరుసగా రెండో విజయం అందుకుంది. బట్లర్‌‌‌‌కు తోడు సాయి కిశోర్ (36 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 49) ఆకట్టుకున్నాడు.  బట్లర్‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

ఆదుకున్న లివింగ్‌‌స్టోన్‌‌

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7) సహా టాపార్డర్‌‌‌‌ ఫెయిలైంది. రెండో ఓవర్లోనే అర్షద్‌‌ ఖాన్‌‌  షార్ట్‌‌ బాల్‌‌కు కోహ్లీ.. ప్రసిధ్‌‌కు సింపుల్‌‌ క్యాచ్ ఇచ్చాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్‌‌  వరుస ఓవర్లలో తన మాజీ టీమ్‌‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 

తొలుత దేవదత్ పడిక్కల్ (4)ను క్లీన్ బౌల్డ్ చేసిన అతను ఓ ఫోర్‌‌‌‌, సిక్స్‌‌తో ఊపు మీద కనిపించిన సాల్ట్‌‌ను కూడా బౌల్డ్‌‌ చేయడంతో పవర్‌‌‌‌ ప్లేలో ఆర్సీబీ 38/3తో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కెప్టెన్ రజత్ పటీదార్ (12)ను  ఎల్బీ చేసిన వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ హోమ్‌‌టీమ్‌‌ను 42/4తో మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ టైమ్‌‌లో లివింగ్‌‌స్టోన్‌‌, జితేష్ శర్మ  ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దారు. ఇషాంత్‌‌ తర్వాతి ఓవర్లోనే 6, 4, 4తో 17 రన్స్ రాబట్టి జితేష్​ ఆటకు ఊపు తెచ్చాడు. మరో ఎండ్‌‌లో క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న లివింగ్‌‌ స్టోన్‌‌ రషీద్ ఖాన్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు.  

సాయి కిశోర్ వరుస ఓవర్లలో జితేష్, క్రునాల్ పాండ్యా (5) ఔటైనా.. స్లాగ్ ఓవర్లలో  లివింగ్‌‌స్టోన్‌‌తో పాటు మరో హిట్టర్ టిమ్ డేవిడ్‌‌ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రషీద్ వేసిన 16వ ఓవర్లో లివింగ్‌‌స్టోన్‌‌ సిక్స్ కొట్టగా.. సాయి కిశోర్ బౌలింగ్‌‌లో డేవిడ్‌‌ భారీ సిక్స్ బాదాడు. రషీద్‌‌ను టార్గెట్‌‌ చేసిన లివింగ్‌‌స్టోన్‌‌ 18వ  ఓవర్లో మూడు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతడిని తర్వాతి ఓవర్లో సిరాజ్ ఔట్ చేశాడు. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 6, 4  కొట్టి ఔటైన డేవిడ్‌‌ స్కోరు 160 మార్కు దాటించాడు. 

జీటీ ఫటాఫట్‌‌

ఆర్సీబీ తడబడిన పిచ్‌‌పై చిన్న టార్గెట్‌‌ను గుజరాత్‌‌  సులువుగా అందుకుంది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌‌, శుభ్‌‌మన్ గిల్ (14) తొలి వికెట్‌‌కు 32 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. సాయి తన ఫామ్‌‌ను కొనసాగించగా.. నిదానంగా ఆడిన గిల్ ఐదో ఓవర్లో భువనేశ్వర్‌‌‌‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన బట్లర్‌‌‌‌ తొలుత నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌‌కు పని చెప్పాడు. రసిక్‌ సలామ్‌‌ వేసిన 9వ ఓవర్లో 4, 6, 6తో ఒక్కసారిగా జోరందుకున్నాడు. మరో ఎండ్‌‌లో సుదర్శన్‌‌ క్లాసిక్ షాట్లతో క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టాడు. 

క్రునాల్ వేసిన 12వ ఓవర్లో బట్లర్ సిక్స్ కొడితే... సాయి రెండు ఫోర్లు రాబట్టడంతో స్కోరు వంద దాటింది. కానీ, హేజిల్‌‌వుడ్ బౌలింగ్‌‌లో కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌ ఇచ్చిన సుదర్శన్‌ ఒక్క రన్ తేడాతో ఫిఫ్టీ కోల్పోయాడు. అప్పటికే మ్యాచ్ జీటీ చేతుల్లోకి వచ్చేసింది. హిట్టర్ రూథర్‌‌‌‌ఫోర్డ్ (30 నాటౌట్‌‌) తోడుగా బట్లర్ తన ధాటిని కొనసాగించాడు. లివింగ్‌‌స్టోన్ బౌలింగ్‌‌లో 4, 6తో 31 బాల్స్‌‌లోనే  ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  ఆ తర్వాత తను మరింత రెచ్చిపోయాడు. హేజిల్‌‌వుడ్ వేసిన 18వ ఓవర్లో బట్లర్  రెండు సిక్సర్లు కొట్టగా.. రూథర్‌‌‌‌ ఫోర్డ్‌‌ మరో సిక్స్‌‌తో మ్యాచ్ ముగించాడు.  

సంక్షిప్త స్కోర్లు

ఆర్సీబీ: 20 ఓవర్లలో  169/8 (లివింగ్‌‌స్టోన్ 54, జితేష్ 33, డేవిడ్ 32, సిరాజ్‌‌ 3/19).
జీటీ:17.5 ఓవర్లలో 170/2 (బట్లర్ 73*  , సుదర్శన్ 49,  భువనేశ్వర్ 1/23)