బడుగుల చేతికి భూములు!

గుజరాత్​లో కొత్త చరిత్ర నడుస్తోంది. అన్ని కులాలకు సమానావకాశాలు లభిస్తున్నాయి. దళితులు, గిరిజనులూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇన్నాళ్లూ పేపర్లకే పరిమితమైన భూములు ఇప్పుడు వారి సొంతమవుతున్నాయి. ఈ దిశగా ‘రాష్ట్రీయ దళిత్ అధికార్​ మంచ్​’ సంస్థ చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఆరు గ్రామాల్లో వంద ఎకరాలకుపైగా భూములను అంబేద్కర్​ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు పంచారు. జనవరి 26న 26 జిల్లాల్లో మరింత మందికి భూములు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు.

ఒకప్పుడు సొంత భూమినిబట్టి వాళ్ల సోషల్​ స్టేటస్​ చెప్పే పరిస్థితి ఉండేది. ఎకరాల కొద్దీ భూములున్నోళ్లను పెద్ద కులంవాళ్లని, సెంటు భూమి కూడా లేనోళ్లను దళితులనో, గిరిజనులనో అనుకునేవారు. దానికి తగ్గట్లే వ్యవసాయ కూలీల్లోనూ ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలే ఉండేవారు. ఆయా వర్గాలకు భూములపై హక్కులుండేవి కాదు. వాళ్ల భూములను దొరలు, పటేళ్లు​, పట్వారీలే తమ పేరిట రాసుకొని అనుభవించేవారు.

ఈ పరిస్థితిలో మార్పు కోసం ల్యాండ్​ రిఫార్మ్స్​ తెచ్చారు. కుల వివక్షకు తెర దించగలమని భావించారు. కానీ ఈ  రిఫార్మ్స్ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఇండిపెండెన్స్​ వచ్చిన చానాళ్ల తర్వాత కూడా రూరల్​ ఏరియాల్లోని సామాజికాభివృద్ధి చెందిన తరగతుల్లో (ఎస్ఏసీల్లో​) 39.4 శాతం మందికి సొంత భూములుంటే ఎస్సీల్లో 17.1 శాతం మందికే ఉన్నట్లు 66వ నేషనల్​ శాంపిల్​ సర్వే చెప్పింది. వ్యవసాయ పనులు చేసే ఎస్సీలు ఏకంగా 58.9 శాతంగా ఉంటే ఎస్​ఏసీలు మాత్రం 26.2 శాతంగానే తేలింది.

సౌరాష్ట్రలో కాస్త పర్లేదు

1940, 50ల్లో జరిగిన భూపంపిణీలతో ఎస్సీ, ఎస్టీలకు ఏమీ ఒరగ లేదు. యునైటెడ్​ సౌరాష్ట్ర ఉద్యమం పుణ్యమా అని ఈ లోటు కాస్త భర్తీ అయింది. పటీదార్​ కమ్యూనిటీ (భూముల్లేని శూద్రులు) అభివృద్ధి చెందింది. వీళ్లు తర్వాతి కాలంలో గుజరాత్​లోని డామినెంట్​ సెక్షన్స్​లో ఒకటిగా డెవలప్​ అయ్యారు. కానీ, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో (ముఖ్యంగా నార్త్​లో) ల్యాండ్​ రిఫార్మ్స్​ ప్రభావం తీసికట్టుగానే ఉండిపోయింది.

ఈ ఘటనలపై పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు పెరిగాయి. ఈ తప్పులను సరిచేయటానికి ‘రాష్ట్రీయ దళిత్​ అధికార్​ మంచ్’ (ఆర్​డీఏఎం) అనే ఆర్గనైజేషన్​ కంకణం కట్టుకుంది. ఈ సంస్థ 2016లో కచ్, బనస్కాంత జిల్లాల్లో భారీ ఉద్యమాలు చేసింది. దశాబ్దాల కిందటే దళితులకు ఇచ్చిన భూములను పెద్దలు తీసుకోవటాన్ని ప్రశ్నిస్తోంది.

చేతికందిన వేల ఎకరాలు

ఆర్​డీఏఎం చేస్తున్న కృషి క్రమంగా ఫలిస్తోంది. కచ్​ జిల్లాలోని రాపర్​ ఏరియాలో రెవెన్యూ ఆఫీసర్లు ఇప్పటిదాక మూడు వేల ఎకరాలకుపైగా భూములను దళితుల పేరిట పట్టాలు చేసి ఇచ్చారు. ఆ భూముల్లో రైతులు పంటలు కూడా వేశారు. బొతాడ్​, భావ్​నగర్​, అమ్రెలి, కచ్​, బనస్కాంత తదితర ప్రాంతాల్లోని ఆరు గ్రామాల్లో వంద ఎకరాలకుపైగా భూములను ఈ నెల 6న (అంబేద్కర్​ వర్ధంతి సందర్భంగా) నిరుపేదలకు పంచారు. జనవరి 26న 26 జిల్లాల్లో మరింత మందికి భూములు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు.