సింగపూర్ : ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇప్పట్లో ఫలితం వచ్చేలా కనిపించడం లేదు. బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను కూడా ఇద్దరు ప్లేయర్లు 51 ఎత్తుల వద్డ డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో ఇది వరుసగా ఐదో డ్రా కాగా, ఓవరాల్‌గా ఆరోది. ఈ రౌండ్ తర్వాత ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు చెరో నాలుగు పాయింట్లతో నిలిచారు. చాంపియన్‌షిప్ నెగ్గాలంటే మరో మూడున్నర పాయింట్లు అవసరం. నల్ల పావులతో ఆడిన గుకేశ్ చివరి వరకు పోరాడినా.. లిరెన్ వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తూ అడ్డుకున్నాడు.
దీంతో గేమ్ మొత్తంలో ఒక్కసారి కూడా ఎవరికీ అనుకూలమైన ఫలితం వచ్చేలా కనిపించలేదు. రిజల్ట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో చివరకు ఇద్దరు ప్లేయర్లు డ్రాకు అంగీకరించారు. తొలి గేమ్‌లో లిరెన్ గెలిస్తే, మూడో గేమ్‌లో గుకేశ్ విజయం సాధించాడు. మిగతా గేమ్‌లన్నీ డ్రాగా ముగిశాయి. మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో రాబోయే రెండు గేమ్‌లు అత్యంత కీలకం కానున్నాయి.