గుకేశ్‌‌‌‌‌‌‌‌, మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం

గుకేశ్‌‌‌‌‌‌‌‌, మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం
  • మెన్స్ హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్, పారా హైజంపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కు కూడా
  • తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి అర్జున పురస్కారం
  • 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు 

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 18 ఏండ్ల వయసులోనే   వరల్డ్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొమ్మరాజు గుకేశ్‌‌‌‌‌‌‌‌ ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇద్దరినీ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌‌‌‌‌‌‌‌చంద్‌‌‌‌‌‌‌‌ ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న అవార్డుకు ఎంపికచేసింది. వీరితో పాటు  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో కాంస్య పతకం గెలిచిన  మెన్స్‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్‌‌‌‌‌‌‌‌, పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌, హై జంపర్  ప్రవీణ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఖేల్‌‌‌‌‌‌‌‌రత్నతో  గౌరవించింది. తెలంగాణ నుంచి పారా అథ్లెట్‌‌‌‌‌‌‌‌ జీవాంజి దీప్తి అర్జున అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు 2024 ఏడాదికి గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నలుగురికి ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న, 32 మందికి అర్జున అవార్డులను గురువారం ప్రకటించింది. అర్జున అవార్డుకు ఎంపికైన వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము  క్రీడా పురస్కారాలను అందజేస్తారు.  ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న అవార్డీలకు రూ. 25 లక్షల నగదు, అర్జున అవార్డీలకు రూ.15 లక్షల క్యాష్ రివార్డు కూడా లభిస్తుంది.

ప్రతిభకు పురస్కారం

ఖేల్‌‌‌‌‌‌‌‌రత్నకు ఎంపికైన నలుగురు తమ ఆటల్లో దేశ కీర్తిని ఇనుమడించినవారే. 22 ఏండ్ల మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో రెండు పతకాలు నెగ్గిన దేశ తొలి అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కింది. ఆగస్టులో జరిగిన పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో మను కాంస్య పతకాలు గెలిచింది. అయితే,  సెలెక్షన్ కమిటీని భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్మరించిందని, ఆమె నుంచి దరఖాస్తు రాకపోవడంతో తనకు ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న ఇవ్వడం లేదన్న వార్తలు వివాదం సృష్టించాయి. దరఖాస్తు ప్రక్రియలో తన నుంచి కూడా పొరపాటు జరిగి ఉండవచ్చని మను అంగీకరించింది.  ఈ వివాదం పరిష్కారం అవ్వడంతో తనకు ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న లాంఛనమే అయింది. కాగా, ఇదే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కెప్టెన్సీలోని ఇండియా హాకీ టీమ్ కాంస్యం నెగ్గింది. ఆ టోర్నీలో అత్యధికంగా పది గోల్స్‌‌‌‌‌‌‌‌ చేసిన హర్మన్‌‌‌‌‌‌‌‌ జట్టు  వరుసగా రెండో ఒలింపిక్ మెడల్‌‌‌‌‌‌‌‌  అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే జట్టులో సభ్యులైన జర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, సుఖ్‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, అజయ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌తో పాటు పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పతకాలు నెగ్గిన రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమన్ సెహ్రావత్‌‌‌‌‌‌‌‌, షూటర్లు స్వప్నిల్ కుశాలె, సరబ్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ అర్జునకు ఎంపికయ్యారు.  ఇక, 18 ఏండ్ల గుకేశ్‌‌‌‌‌‌‌‌ గతేడాది చివర్లో చైనా జీఎం డింగ్‌‌‌‌‌‌‌‌ లిరెన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఇండియా నుంచి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. యంగెస్ట్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా చరిత్రకెక్కిన గుకేశ్‌‌‌‌‌‌‌‌.. లెజెండరీ షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభినవ్ బింద్రా (2001) తర్వాత ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న అందుకోనున్న పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తున్నాడు. చెస్‌‌‌‌‌‌‌‌లో ఆనంద్ తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో వ్యక్తి గుకేశ్ కావడం మరో విశేషం. ఇక, పారిస్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ64 కేటగిరీ హై జంప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. అర్జున అందుకున్న వారిలో ఏపీ అథ్లెట్‌‌‌‌‌‌‌‌ యెర్రాజి జ్యోతితో పాటు జావెలిన్ త్రోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ను రాణి, విమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ సలీమా టెటే, చెస్ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌ వంతికా అగర్వాల్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారు.

‘చందు చాంపియన్​’కు గుర్తింపు

పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు తొలి గోల్డ్ అందించిన  మురళీ కాంత్‌‌‌‌‌‌‌‌ పేట్కర్‌‌‌‌‌‌‌‌కు  లైఫ్‌‌‌‌‌‌‌‌ టైమ్ కేటగిరీలో అర్జున లభించింది. 1972 పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పేట్కర్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌‌‌‌‌‌‌ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ నెగ్గాడు. ఆర్మీలో పని చేసిన మురళీ కాంత్‌‌‌‌‌‌‌‌ 1956 ఇండియా–పాకిస్తాన్ యుద్ధంలో బుల్లెట్‌‌‌‌‌‌‌‌ గాయంతో పారా అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా మారాడు. అతని జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవలే బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో ‘చందు చాంపియన్‌‌‌‌‌‌‌‌’ అనే సినిమా కూడా వచ్చింది. ఇక,  ఇండియా షూటింగ్ టీమ్ కోచ్ దీపాలీ దేశ్‌‌‌‌‌‌‌‌పాండేతో పాటు హాకీ కోచ్  సందీప్‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌‌‌‌‌, పారా షూటింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ ద్రోణాచార్య అవార్డులు గెలిచారు.

మన దీప్తికి గుర్తింపు

ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలంగాణ నుంచి పారా అథ్లెట్‌‌‌‌‌‌‌‌ జీవాంజి దీప్తి మాత్రమే అవార్డుకు ఎంపికైంది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి పారాలింపిక్స్ 400 మీటర్ల టీ20 విభాగంలో కాంస్య పతకం గెలిచింది. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన దీప్తి మేధోపర బలహీనత కారణంగా చిన్నప్పుడు ‘పిచ్చి పిల్ల’ అంటూ తన ఊర్లో వెక్కిరింపులు ఎదుర్కొంది. తన సమస్య కారణంగా దీప్తి ఎదుటివారు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేక, వేగంగా మాట్లాడలేక ఇబ్బంది పడేది. అయితే, అనూహ్యంగా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టిన ఆమె  స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (సాయ్‌‌‌‌‌‌‌‌) కోచ్ నాగపూరి రమేశ్‌‌‌‌‌‌‌‌ శిక్షణలో అద్భుతాలు చేస్తోంది. పారిస్ పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ముందు వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్  400 మీ. విభాగంలో వరల్డ్ రికార్డు టైమింగ్ (55.06 సె)తో గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఆసియా పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ స్వర్ణ పతకం గెలిచింది. 

అవార్డు విన్నర్లు

ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న: మను భాకర్ (షూటింగ్‌‌‌‌‌‌‌‌), డి. గుకేశ్ (చెస్‌‌‌‌‌‌‌‌), హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌).
అర్జున:  జీవాంజి దీప్తీ (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), యెర్రాజి జ్యోతి (అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), అన్ను రాణి(అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), నీతు(బాక్సింగ్‌‌‌‌‌‌‌‌), సవీటీ బూర (బాక్సింగ్‌‌‌‌‌‌‌‌), వంతికా అగర్వాల్‌‌‌‌‌‌‌‌(చెస్‌‌‌‌‌‌‌‌), సలీమా టెటె (హాకీ),అభిషేక్‌‌‌‌‌‌‌‌ (హాకీ), సంజయ్‌‌‌‌‌‌‌‌(హాకీ), జర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌(హాకీ), సుఖ్‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌(హాకీ), స్వప్నిల్‌‌‌‌‌‌‌‌ కుశాలే(షూటింగ్‌‌‌‌‌‌‌‌), సరబ్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌(షూటింగ్‌‌‌‌‌‌‌‌), అభయ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (స్క్వాష్‌‌‌‌‌‌‌‌), సజన్‌‌‌‌‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ (స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌),  అమన్‌‌‌‌‌‌‌‌ సెహ్రావత్‌‌‌‌‌‌‌‌ (రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌),  రాకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (పారా ఆర్చర్‌‌‌‌‌‌‌‌), ప్రీతి పాల్‌‌‌‌‌‌‌‌ (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), అజీత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌  (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), సచిన్‌‌‌‌‌‌‌‌ సర్జేరావు  (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌),  ధరంబీర్( పారా అథ్లెటిక్స్), ప్రణవ్‌‌‌‌‌‌‌‌ సూర్మ (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌),  హోకాటో సెమా (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌),  సిమ్రన్‌‌‌‌‌‌‌‌ (పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), నవదీప్‌‌‌‌‌‌‌‌(పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌),  నితీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ (పారా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌), తులసిమతి (పారా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌), నిత్య శ్రీ  (పారా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌),  మనీషా  రాందాస్‌‌‌‌‌‌‌‌(పారా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌), కపిల్‌‌‌‌‌‌‌‌ పర్మార్‌‌‌‌‌‌‌‌ (పారా జూడో), మోనా అగర్వాల్‌‌‌‌‌‌‌‌(పారా షూటింగ్‌‌‌‌‌‌‌‌),  రుబినా ఫ్రాన్సిస్‌‌‌‌‌‌‌‌ (పారా షూటింగ్‌‌‌‌‌‌‌‌),
లైఫ్ టైమ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో అర్జున: - సుచా సింగ్‌‌‌‌‌‌‌‌ (అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌), మురళీకాంత్‌‌‌‌‌‌‌‌  (పారా స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌),
ద్రోణాచార్య:  సుభాష్‌‌‌‌‌‌‌‌ రాణా (పారా షూటింగ్‌‌‌‌‌‌‌‌), దీపాలీ దేశ్‌‌‌‌‌‌‌‌పాండే (షూటింగ్‌‌‌‌‌‌‌‌),  సందీప్‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌‌‌‌‌ (హాకీ),
లైఫ్‌‌‌‌‌‌‌‌టైం కేటగిరీలో ద్రోణాచార్య:  మురళీధరన్‌‌‌‌‌‌‌‌ (బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌), అర్మాండో కొలాకో (ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌).