- రూ. 5 కోట్ల నజరానా ప్రకటించిన తమిళనాడు సీఎం
సింగపూర్ : నిద్రలేని రాత్రి.. ఎర్రబడిన కళ్లు.. గుండెల నిండా ఆనందం.. వందలాది మందికి ఆటోగ్రాఫ్స్.. చివర్లో అపురూపంగా అందుకున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ట్రోఫీ.. ఇలాంటి క్షణం కోసమే ఎదురు చూస్తున్నానని యంగెస్ట్ వరల్డ్ చాంప్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఉదయం నుంచి రకరకాల కార్యక్రమాలతో బిజీగా గడిపిన గుకేశ్.. వరల్డ్ చెస్ ట్రోఫీ దగ్గర్లోనే ఉన్న కనీసం టచ్ కూడా చేయలేదు. కప్‌ను అందుకునే అపూర్వ క్షణాల కోసం సాయంత్రం వరకు ఆతృతగా ఎదురుచూశాడు.
‘అద్భుతమైన వ్యక్తి, వయసును మించిన పెర్ఫామెన్స్’ అంటూ శుక్రవారం సాయంత్రం జరిగిన క్లోజింగ్ సెర్మనీలో ఫిడే ప్రజెంటర్ చేసిన వ్యాఖ్యలతో స్టేజ్ మీదకు వచ్చిన గుకేశ్.. ఫిడే ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్ నుంచి గోల్డ్ మెడల్, ట్రోఫీతో పాటు రూ. 11.03 కోట్ల ప్రైజ్‌మనీ చెక్‌ను సగర్వంగా అందుకున్నాడు. ఈ సందర్భంగా గుకేశ్ మాట్లాడుతూ ‘దీని (ట్రోఫీ) కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఇలాంటి క్షణాన్ని లెక్కలేనన్ని సార్లు కలలో ఆస్వాదించానని అనిపిస్తోంది. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఈ క్షణం కోసమే నేను మేల్కొన్నానని అనిపించేది.
ఇప్పుడు నిజంగానే ఈ ట్రోఫీని పట్టుకోవడం నా జీవితంలో అన్నింటికంటే ఎక్కువైంది’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమానికి ముందు ఓ చోట కూర్చున్న గుకేశ్.. చిన్నాపెద్ద తేడా లేకుండా తన దగ్గరికి వచ్చిన ప్రతి అభిమానికి ఓపికగా ఆటోగ్రాఫ్ ఇస్తూ చిరునవ్వులు చిందించాడు. ఇందులో ప్రవాస భారతీయులే కాకుండా స్థానిక సింగపూర్ వాసులు కూడా ఉండటం విశేషం. కొంత మంది చెస్ బోర్డులను తీసుకొచ్చి తమ పేరుతో పాటు గుకేశ్ సంతకాన్ని తీసుకుని ఆనందపడ్డారు. ‘ఈ ప్రయాణం ఒక కల కంటే తక్కువ కాదు.
ALSO READ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా.. జట్టులో మార్పులు ఇవే..
ఇందులో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కదాన్ని నేను మార్చలేదు. నాతో ఉన్న వ్యక్తుల కారణంగా ఈ ప్రయాణం చాలా అందంగా సాగింది. గత మూడు వారాలుగా నాతో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను పరిష్కరించలేని సమస్య ఎదురైనప్పుడు దేవుడే మార్గం చూపాడు’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.
ఇక ముగింపు వేడుకల్లో పాల్గొన్న డ్వోర్కోవిచ్.. గుకేశ్, లిరెన్ పెర్ఫామెన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే వాడ్లిమర్ క్రామ్నిక్ మాత్రం పోటీపై విమర్శలు గుప్పించాడు. ఇక చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ. 5 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించారు.