అప్పుడు తన వయసు ఏడేళ్లు. కొత్త కొత్త ఆటలు ఆడాలనే ఉరకలేసే ఈడు. ఆ టైంలోనే చెస్ ఆట తన మనసుకు ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి చెస్ మీద ఆసక్తి రోజురోజుకీ పెరిగిపోసాగింది. ఎంతగా అంటే.. నాలుగో తరగతిలోనే చెస్ ఛాంపియన్ కావాలనేంతగా! ఆ కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది. దానికోసం ఎంత పట్టుదలగా ఉన్నాడో తెలపడానికి18 ఏండ్లకే తన లక్ష్యాన్ని చేరుకున్న విధానమే నిదర్శనం. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా ‘చిన్న వయసులోనే చరిత్ర సృష్టించిన ఏకైక ఛాంపియన్ గుకేశ్’అని ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
గుకేశ్ దొమ్మరాజు.. తెలుగు మూలాలున్న తమిళుడు. తల్లి పద్మకుమారి, తండ్రి రజినీకాంత్ ఈఎన్టీ సర్జన్. కొడుకుకి చెస్ మీద ఉన్న ఆసక్తి చూసి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే తండ్రి తన ఉద్యోగాన్నే వదిలేసి, కొడుకుతోపాటు చెస్ పోటీలకు వెళ్లేవాడు. దీంతో ఇల్లు గడవడానికి తల్లి ఆదాయం ఆసరా అయింది.
Also Read :- మరోసారి విలన్ అయ్యాడు
‘‘2013లో కార్ల్సన్, ఆనంద్ పోటీపడుతుంటే చూసి ఒకరోజు అద్దాల గదిలో కూర్చుంటే బాగుంటుంది అనుకున్నాడట గుకేశ్. ఇప్పుడు అక్కడికి చేరుకోవడం, పక్కనే జాతీయ జెండా ఉండడం తన జీవితంలో మర్చిపోలేని రోజు’’ అని ఎంతో సంతోషంగా చెప్పాడు. అంతేకాకుండా.. ‘‘ప్రపంచ ఛాంపియన్ గెలిచినంత మాత్రాన నేనే బెస్ట్ అని కాదు. ఇప్పుడే నా కెరీర్ మొదలైంది. ఇంకా చాలా ఉంది’’ అంటూ తన విన్నింగ్ స్పీచ్తో అందర్నీ ఇన్స్పైర్ చేశాడు.