గల్ఫ్​ ఏజెంట్​ ఆత్మహత్యాయత్నం

  • నకిలీ వీసాల వ్యవహారంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే..

మెట్ పల్లి, వెలుగు: దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు ఇప్పించిన గల్ఫ్​ఏజెంట్.. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని చైతన్యనగర్‌‌కు చెందిన గల్ఫ్​ఏజెంట్​అలిగేటి రమేశ్‌..60 మందికి నకిలీ వీసాలు ఇప్పించాడు. వాటితో దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైన పలువురిని ఈ నెల 25న శంషాబాద్​ఎయిర్‌‌పోర్టులో ఇమ్మిగ్రేషన్​ అధికారులు అడ్డగించారు.

దీనిపై బాధితుల ఫిర్యాదుతో మెట్‌పల్లి పోలీసులు ఏజెంట్​రమేశ్‌పై మూడు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో రమేశ్..సోమవారం పట్టణ శివారులో వివిధ రకాల టాబ్లెట్స్‌ కలిపి మింగాడు. ఆ వైపుగా వెళ్తున్న కొందరు రమేశ్‌ను గమనించి..హాస్పిటల్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, తన కొడుకు దుబాయ్‌లో ఉండే మరో వ్యక్తి ద్వారా మోసపోయాడని రమేశ్​తల్లి చెప్పింది.