- రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ గల్ఫ్బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తలే
ఇందల్వాయి, డిచ్పల్లి, వెలుగు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 5 నెలల పాలనలో గల్ఫ్ బోర్డుని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే గల్ఫ్ బోర్డ్ అంశాన్ని కాంగ్రెస్ ముందుకు తెచ్చిందన్నారు. శుక్రవారం ఇందల్వాయి మండలం గన్నారంలో, డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తొలగిస్తుందనే బూటకపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు.
పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. బీజేపీ కి ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. రాజస్థాన్ రాష్ట్ర బిల్వాల్ ఎంపీ అభ్యర్థి దామోదర్ అగర్వాల్, జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ భూమన్న, మండలాధ్యక్షుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.