- గల్ఫ్ బోర్డు, ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయకపోవడంతో అధికార పార్టీపై పోరుబాట
- గత మేనిఫెస్టోల్లో హామీ ఇచ్చిన రూలింగ్ పార్టీ
- మాట తప్పారని గల్ఫ్ కార్మికుల గుస్సా
- పసుపు బోర్డు ఉద్యమ తరహాలో పోరాటం
- కామారెడ్డిలో 120 నామినేషన్లు వేయడానికి గల్ఫ్ జేఏసీ ప్లాన్
జగిత్యాల, వెలుగు : ఉత్తర తెలంగాణలో సరైన ఉపాధి అవకాశాలు లేక లక్షల మంది ఎంతో కాలంగా గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులుగా పని చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తమ బతుకులు మారుతాయని ఆశించగా అలాంటిదేమీ జరగలేదు. కానీ, గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలిస్తూ వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల టైంలో అధికార పార్టీ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు చెందిన ఓట్లు పొందేందుకు ఎన్ఆర్ఐ పాలసీతో పాటు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చింది. ఉద్యమ సమయంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఆ అంశాలు కేవలం మేనిఫెస్టో వరకే పరిమితమయ్యాయి.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ గల్ఫ్ బోర్డు ఊసెత్తకపోవడంతో కార్మికుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ఆగ్రహించిన వారంతా ఏకంగా సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్న కామారెడ్డిలోనే గల్ఫ్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో సర్కారు వ్యతిరేక ఓటు బ్యాంకుగా మారిన గల్ఫ్ కార్మికులను ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీలు హామీలిస్తూ పావులు కదుపుతున్నాయి.
ఉమ్మడి ఏపీలో అలా.. స్వరాష్ట్రంలో ఇలా..
2008 ఏప్రిల్ 27న సికింద్రాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ 7వ ప్లీనరీలో గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలని ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఎన్ఆర్ఐ పిల్లలకు కేరళ తరహాలో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గల్ఫ్ లో చనిపోయిన వారి మృతదేహాలను తెప్పించేందుకు మానిటర్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టేలోనూ ఈ అంశాలను ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికులకు చేయాల్సిందంతా చేస్తామని హామీలు గుప్పించారు. కానీ, అధికారంలోకి వచ్చి పదేండ్లవుతున్నా, మూడోసారి ఎన్నికలు జరుగుతున్నా వాటి గురించి మాట్లాడడం లేదు.
కామారెడ్డిలో వందకు పైగా నామినేషన్లు
గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోటీ చేసి గల్ఫ్ కార్మికుల సమస్య తీవ్రతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్తామని గల్ఫ్ కార్మిక సంఘాల జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులంతా మూకుమ్మడిగా నామినేషన్లు వేసి పోటీ చేయడంతో ఆమె పరాజయం పాలయ్యారు. ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకున్న గల్ఫ్ జేఏసీ నేతలు పోటీకి సై అంటున్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో గల్ఫ్ మృతుల కుటుంబసభ్యులు, గల్ఫ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన వారి తో కలిపి సుమారు120 మందికి పైగా నామినేషన్లు వేసేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే సీఎం కొడుకు, మినిస్టర్ కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లతో పాటు వేములవాడ, కోరుట్ల, బాల్కొండ, నిర్మల్, జగిత్యాల నియోజకవర్గాల్లో జేఏసీ నేతలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు.
పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం..
సర్కార్‌పై పోరుకు దిగిన గల్ఫ్ కార్మికులు, బాధితుల ఓట్లను ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం తెలంగాణకు చెందిన కార్మికుల సంఖ్య15 లక్షలకు పైగానే ఉండగా, ఇందులో10 లక్షల మంది ఉత్తర తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన వారు మరో 5 లక్షల మంది ఉన్నారు. 20 ఏండ్లలో 30 లక్షల మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చినట్లు లెక్కలు చెపుతున్నాయి.
వీరి కుటుంబాలతో కలుపుకుంటే లక్షల్లోనే గల్ఫ్ ఓటు బ్యాంకు ఉంటుంది. ఈ లెక్కన గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గాల్లో 8 శాతం నుంచి 22 శాతంగా ఉన్న ఓట్లు ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయగలుతాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి వీరి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు స్కెచ్వేస్తున్నాయి.
కామారెడ్డితో పాటు ఆరు చోట్ల పోటీ చేస్తం
గల్ఫ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలవకపోగా, కార్మికుల మృతదేహాలను తీసుకురావడంలోనూ శ్రద్ధ చూపట్లేదు. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తారని ఎదురుచూశాం. గతంలో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా గల్ఫ్ పాలసీ అంశాన్ని పెట్టకపోవడం బాధాకరం. వారికి కనువిప్పు కలిగేలా జేఏసీ ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మూకుమ్మడి నామినేషన్లు వేసి నిరసన వ్యక్తం చేస్తాం.
ఇప్పటికే 120 నామినేషన్లు వేసేలా ప్లాన్ చేశాం. మినిస్టర్ కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లతో పాటు వేములవాడ, కోరుట్ల, బాల్కొండ, నిర్మల్, జగిత్యాల నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికులు, బాధిత కుటుంబ సభ్యులు, గల్ఫ్ జేఏసీ నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
– గుగ్గిళ్ల రవి గౌడ్, గల్ఫ్ జేఏసీ స్టేట్ చైర్మన్