- సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లా వాసి
హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. కువైట్ సౌదీ అరేబియా సరిహద్దులోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురైన రాథోడ్ నాందేవ్ సీఎం రేవంత్ చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. ఈ క్రమంలో మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ లతో పాటు బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం సీఎంని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్ .. ఇంటి పని వీసాపై కువైట్ వెళ్లాడు. అయితే, తన యజమాని అతన్ని కువైట్ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. ఈ క్రమంలో తన యజమాని నన్ను హింసిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో తీసుకొని
ఆగస్టులో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకొని నాందేవ్ ను స్వదేశానికి వచ్చేలా చేశారు.