గల్ఫ్ కార్మికుల గోస తీరకపాయె

గల్ఫ్ కార్మికుల గోస తీరకపాయె

రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన గల్ఫ్​కార్మికుల గోస తీరడం లేదు. ఎంతో కొంత సంపాదించకపోతామా అనే ఆశలతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొందరు, అప్పులు చేసి మరికొందరు, ఆస్తులు అమ్ముకుని ఇంకొందరు వెళ్లిన లక్షలాది మంది ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బ్రోకర్ల మోసాలకు బలైపోయి.. అప్పులు తీర్చలేక, సరైన సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేసింది.

రాష్ట్రం నుంచి దాదాపు 15 లక్షల మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వలసలువెళ్లారు. పైచదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లినవారికంటే బతుకుదెరువు కోసం వెళ్లినవారు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, కువైట్, యూఏఈ, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర దేశాలకు లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోసం ఏటా వెళుతుంటారు. వీరిలో సరైన ఉద్యోగం, ఉపాధి దొరికేది కొద్ది మందికే. మిగతా వారు ఏజెంట్ల మోసాలకు, లేక కంపెనీల దాష్టీకాలకు బలైపోవడమో జరుగుతోంది.

ఏజెంట్ల మోసాలతో కుదేలు

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పేద కార్మికులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు. వీరంతా భవన నిర్మాణంలో లేదా పలు రకాల కంపెనీల్లో ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధమై వెళుతున్నారు. కమీషన్ కక్కుర్తితో ఏజెన్సీలు కార్మికులను మోసగిస్తున్నాయి. వర్క్​ వీసా అని చెప్పి.. విజిటింగ్​ వీసాపై చాలా మందిని పంపి డబ్బులు దండుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు కార్మికుల పాస్ పోర్టులను లాక్కొని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుని దశాబ్దాలపాటు అక్కడి జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు.

డెడ్​బాడీ రావడం కూడా గగనమే

గల్ఫ్ దేశాల నుంచి సగటున రెండు రోజులకు ఒక డెడ్​బాడీ రాష్ట్రానికి చేరుకుంటోంది. ప్రమాదవశాత్తు లేదా గుండెపోటుతో చనిపోతే డెడ్​బాడీ తీసుకురావడానికి నాలుగైదు రోజులు పడుతుంటే.. ఆత్మహత్యకు పాల్పడి మరణిస్తే అక్కడి తతంగమంతా పూర్తి చేసుకుని తీసుకురావాలంటే వారం, పది రోజులు పట్టే పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలకు ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వెళ్లినవారు ప్రమాదాల బారినపడి చనిపోతే వారి డెడ్​బాడీలను కుటుంబ సభ్యులకు చేర్చేందుకు ప్రభుత్వాలు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. కానీ, గల్ఫ్ కార్మికుల విషయంలో ఎందుకు జరగడం లేదనే బాధ ప్రతి గల్ఫ్​ బాధిత కుటుంబానికీ కలుగుతోంది.

ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు

ఇతర దేశాల్లో ఉండే తమ పౌరులకు ఆసరాగా ఉండటానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా ఆయా దేశాలతో సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి సంక్షేమానికి పలు చట్టాలు చేసి, పలు సంస్థలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నాయి. మన రాష్ట్రానికి వచ్చేసరికి గల్ఫ్ బాధితులకు అలాంటి సహాయక చర్యలు అనుకున్నంత జరగడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి

గల్ఫ్​ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక అధ్యయనం చేయాలి. ఏజెన్సీలు ఎందుకు మోసాలు చేస్తున్నాయి? అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ప్రమాదాలు, ఆత్మహత్యలకు కారణాలేంటి? లాంటి విషయాలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం గల్ఫ్​ కార్మికుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి అమలుకు నోచుకునేలా కృషి చేయాలి. ‘నాన్ రెసిడెంట్​ ఇండియన్ పాలసీ’తీసుకువచ్చి ప్రభుత్వ పరంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ఆయా దేశాల్లోనూ, రాష్ట్రంలోనూ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్ కేటాయించి తక్షణమే వారి సమస్యలను మానిటర్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ఎవరైనా గల్ఫ్​ కార్మికుడు ఆకస్మికంగా మరణిస్తే ప్రభుత్వ ఖర్చులతో డెడ్​ బాడీని కుటుంబీకులకు అప్పగించాలి. వారికి ఆర్థికంగా అవసరమైన సాయం అందించాలి. ముందుగానే బీమా సౌకర్యం కల్పించి ఆర్థికంగా భరోసా ఇవ్వాలి. పింఛన్ వచ్చేలా చేసి కుటుంబాలు బజారున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలి. వీలైనంత వరకు కార్మిక వర్గం విదేశాలకు వలస వెళ్లకుండా నిరోధిస్తూ, వారికి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉన్నది. సమాజం మేలు కోరే మేధావి వర్గం, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, పరిశోధకులు గల్ఫ్ బాధితుల గురించి పూర్తి విశ్లేషణ చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేకూర్చేలా ఒత్తిడి తేవాలి.

ఎన్నో రకాల సమస్యలు

గల్ఫ్​ కార్మికులు ఎదుర్కొనే సమస్యల్లో మొదటిది భాష. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలపై పట్టుంటే ఈ సమస్య తీరినట్టే. చదువుకున్నవారు ఉద్యోగాల కోసం అక్కడికి వెళితే వారికి ఈ సమస్య ఉండదు. రాష్ట్రం నుంచి ఎక్కువగా గల్ఫ్​ దేశాలకు వెళ్లేది కార్మికులే. వీరికి ఇంగ్లిష్​, హిందీ, ఉర్దూ భాషలపై పట్టు ఉండదు. దీంతో వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.  ఇంకొందరు అక్కడి వాతావరణానికి అలవాటు పడలేక రోగాల బారినపడుతున్నారు. మరికొందరు ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు పనులు చేసే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరిగి, ప్రాణం ఎలా పోతుందో తెలియని పరిస్థితి. ఎవరైనా కార్మికుడు చనిపోతే అతని డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అందజేయడానికి ఎన్నో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. కొంత మంది చనిపోయిన విషయం కూడా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందడం లేదు.