తెలంగాణ అసెంబ్లీ బరిలో గల్ఫ్ కార్మికులు

జగిత్యాల, వెలుగు: గల్ఫ్​ ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు.. కేరళ తరహాలో ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టాలన్న డిమాండ్​ ఎన్నికల అంశంగా మారుతున్నది. గల్ఫ్​లో పని చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు, పని చేసి తిరిగివచ్చిన వారి సమస్యలు ఎన్నికల్లో ప్రధాన అంశంగా మార్చేందుకు గల్ఫ్ జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. గల్ఫ్ కార్మికుల ప్రభావం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో భారీ ఎత్తున నామినేషన్లు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి నియోజకవర్గంలో కనీసం వంద మందిని పోటీలో నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఉత్తర తెలంగాణలో దాదాపు 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేయగలమని చెప్తున్న జేఏసీ.. ఈ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు వేయాలని భావిస్తోంది. గత పార్లమెంట్​ఎన్నికల్లో పసుపు బోర్డ్​ కోసం రైతులు చేసిన ఉద్యమం తమకు ఆదర్శమని చెప్తున్నా రు. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 88 లక్షల మంది ఇండియన్స్ గల్ఫ్ దేశాల్లో ఉండగా.. ఇందులో 15 లక్షల మంది తెలంగాణకు చెందిన వారున్నారు. మరో 30 లక్షల మంది అక్కడ పనిచేసి తిరిగొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో వీరు, వీరి కుటుంబ సభ్యులు 8 శాతం నుంచి 22 శాతం ఉంటారని, అక్కడ ఫలితాలను శాసిస్తారని జేఏసీ భావిస్తున్నది.

ఎన్ఆర్ఐ పాలసీ హామీ మరిచిన కేసీఆర్

 కేరళ తరహాలో తెలంగాణలో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని బీఆర్ఎస్ ​మొదటి నుంచి హామీ ఇస్తూవస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో భూములమ్మగా వచ్చిన డబ్బుల నుంచి గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయించాలని 2008 ఏప్రిల్ 27న సికింద్రాబాద్​లో జరిగిన టీఆర్ఎస్ 7వ ప్లీనరీలో అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గల్ఫ్ లో చనిపోయిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గల్ఫ్ ఎన్ఆర్ఐ పిల్లలకు కేరళ తరహాలో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గల్ఫ్ లో చిక్కుకుపోయినవారిని తిరిగి స్వగ్రామాలకు వచ్చేలా సాయపడేందుకు మానిటర్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ఎన్నికల మేనిఫెస్టో లోనూ కేరళలో తరహాలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐల పెట్టుబడులకు ప్రోత్సాహం, గల్ఫ్​కార్మికుల భద్రత లాంటి అంశాలు మేనిఫెస్టోలో చేర్చారు. వాటిని ఇప్పటికీ నెరవేర్చలేదు.  అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్..  తొమ్మిదేండ్లైనా పట్టించుకోలేదు.

32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం

ఈ ఎన్నికల్లో తమ వాయిస్ బలంగా వినిపించాలని గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు, బాధితులు నిర్ణయానికి వచ్చారు. 24 గల్ఫ్​ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈమేరకు కోర్ కమిటీ మీటింగ్​లో తీర్మానం చేశాయి. తెలంగాణలో 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల ప్రభావం ఉంటుందని పలు సర్వేల్లో గుర్తించారు. ఈ నియోజకవర్గాల్లో వీలైనంత మంది పోటీ చేయాలని నిర్ణయించి ఇందుకు కార్యాచరణ రెడీ చేస్తున్నారు. గల్ఫ్ జేఏసీ లీడర్లు గుగ్గిళ్ల రవి గౌడ్ వేములవాడ నుంచి, చెన్నమనేని శ్రీనివాసరావు కోరుట్ల నుంచి, దొనికేని కృష్ణ సిరిసిల్ల నుంచి, స్వదేశ్ నిర్మల్ నుంచి, కల్లెడ భూమయ్య మంచిర్యాల నుంచి పోటీకి సన్నద్ధం అవుతున్నారు. మరికొందరు గల్ఫ్ జేఏసీ నేతలు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్ తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రుద్ర శంకర్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, జిల్లా సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ సింగిరెడ్డి నరేశ్​రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.

200లకుపైగా నామినేషన్లు వేస్తం 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 200 మంది గల్ఫ్​ జేఏసీ నేతలు, బాధితులు, బాధిత కుటుంబాల వారు నామినేషన్లు వేయాలని నిర్ణయించాం. ఇప్పటికే వేములవాడ, కోరుట్ల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాలలో పోటీ చేయడానికి జేఏసీ నేతలను ఖరారు చేశాం. వీరితో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయిస్తం.

‑ గుగ్గిళ్ల రవి గౌడ్, గల్ఫ్ జేఏసీ స్టేట్ చైర్మన్

 గల్ఫ్ నేతలకు టికెట్లు ఇవ్వాలి

రాజకీయ పార్టీలు గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గాల్లో గల్ఫ్ జేఏసీ నేతలకు టికెట్ కేటాయించాలి. ఎన్నో ఏండ్లుగా గల్ఫ్ సంఘాల పేరిట బాధితులను ఆదుకున్నాం. కేంద్ర, రాష్ట్ర సర్కార్​లు గల్ఫ్​ బాధితులను పట్టించుకోవడం లేదు. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కోసం పోరాటంలో భాగంగానే నామినేషన్లు వేస్తం.

‑ రుద్ర శంకర్, గల్ఫ్ తెలంగాణ ప్రవాస 
భారతీయుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్