స్కూల్​ స్టార్టయి నెల.. ఇంకా ఇద్దరే టీచర్లా? రోడ్డెక్కిన​ స్టూడెంట్స్

స్కూల్​ స్టార్టయి నెల.. ఇంకా ఇద్దరే టీచర్లా? రోడ్డెక్కిన​ స్టూడెంట్స్

అశ్వారావుపేట, వెలుగు : విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు గడుస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి హైస్కూల్ లో ఇద్దరే టీచర్స్ ఉండడంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్​కు తాళాలు వేసి విద్యార్థులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో చేశారు. స్కూల్​లో 150 మంది స్టూడెంట్స్​ ఉండగా ఎనిమిది మంది టీచర్లు ఉండాలి. 

కానీ, ఇద్దరు మాత్రమే ఉండడంతో చదువులు సాగడం లేదు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం గుమ్మడవల్లి రోడ్డుపై బైఠాయించి రెండు గంటలు ధర్నా చేశారు. డీఈవో వెంకటేశ్వర చారి సీఆర్పీ రామారావుకు ఫోన్ చేసి గ్రామస్తులతో మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో స్కూల్​కు వేసిన తాళాలు తీసి విద్యార్థులను స్కూల్లోకి పంపించారు.