- ఐఎన్టీయూసీ ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి
గోదావరిఖని, వెలుగు : కాకా వెంకటస్వామి కుటుంబం వల్లే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి తెలిపారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థకు, కార్మికుల కోసం ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ నష్టాలతో బీఐఎఫ్ఆర్ జాబితాలోకి వెళ్లినప్పుడు కాకా చొరవ తీసుకుని ఎన్టీపీసీతో మాట్లాడి రూ.450 కోట్ల రుణాన్ని ఇప్పించి సంస్థ మూత పడకుండా చూశారన్నారు.
గని కార్మికులకు దూరంగా హైదరాబాద్ లో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని గోదావరిఖనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు, కార్మికులకు ఉపయోగపడే విధంగా సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ వరకు ప్రత్యేకంగా 'రామగిరి ఎక్స్‌ప్రెస్' ట్రైన్‌ను కాకా వెంకటస్వామి వేయించారని ఆయన చెప్పారు.
కాకా కుటుంబం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆయన మనుమడు గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధికి ఈ ప్రాంతం నోచుకుంటుందని కుమారస్వామి తెలిపారు. ఈ మీటింగ్‌లో ఐఎన్టీయూసీ లీడర్ పవన్‌కుమార్ పాల్గొన్నారు.