అణగారిన వర్గాల ఆత్మబంధువు

డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథాన్ని ఈ దేశంలోని అణగారిన జాతుల వారికి ప్రసాదించిన గొప్ప సామాజిక పరివర్తకుడు. కుల వ్యవస్థ నిర్మూలన, హింసలేని, దోపిడీలేని శాంతియుత, సాంఘిక వ్యవస్థ నిర్మాణానికి చూపిన దార్శినికుడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనం రద్దు చేసినంత మాత్రాన దళితులే తమ వర్గంగా భావించనక్కర్లేదు. అలాగే భారత రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు ఆదిమ తెగల ప్రజలు, ఇతర వర్గాల ప్రజలూ రుణపడి ఉన్నారు. 

ఇలా భారత జాతినే కాదు ప్రపంచ శాంతి సౌభాగ్యాలను కోరుకున్న అందరివాడుగా ముద్రపడిన డా. భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడలో జన్మించాడు. బాల్యం నుండి దళితుడిగా అనుభవించిన కష్టాలు మరెవరికి రాకూడదని అంటరానితనం పేరిట జరుగుతున్న వివక్షను తొలగించడానికి ఇరవయ్యేళ్లకే కులాల సమస్యను గ్రంథస్థం చేసిన మహామేధావి. బాబాసాహెబ్ అంబేద్కర్ మేధో సంపత్తికి, ఆపార దేశభక్తికి ఆయన నిర్మించిన రాజ్యాంగమే నిదర్శనం. స్వాతంత్ర్యానంతరం 43 ఏండ్ల తదుపరి అంటే,1990లో అంబేద్కర్ కు అత్యున్నత భారతరత్న ప్రకటించడం  చూస్తే ఆయన పట్ల పాలకులు అవలంబించిన తీరు అర్థమవుతుంది. 

ఆదివాసీ గిరిజనుల తొలి ఆత్మబంధువు

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72ఏళ్ళు దాటినా అంబేద్కర్ ఆలోచనా విధానం ప్రకారం దళిత, ఆదివాసీ గిరిజనులు ఇంకా వెనుకబడి ఉండటానికి గల కారణాలను ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రాల్లోని పాలకులు అధ్యయనం చేసిన దాఖలాలు లేవు. రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆదివాసీ గిరిజనులకు చోటు కల్పించిన ప్రత్యేక హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు గమనిస్తే  అంబేద్కరును గిరిజనుల తొలి ఆత్మ బంధువుగా పరిగణించవచ్చు. ఆర్యులకు ముందు మన దేశంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థలు లేవు. వీరు స్థిరపడిన తర్వాత దేశంలో మాల జాతుల వారు అణచివేయబడుతున్నారు. దేశ జనాభాలో 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు చట్టసభల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ముందుచూపుతో  రిజర్వేషన్లు, రాజ్యాధికారం అనే సంకల్పాన్ని ప్రకటించారు అంబేద్కర్. 1946లో ప్రణాళికలను రాజ్యాంగ నిర్మాణంలోకి ప్రవేశ పెడుతున్నప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఆకళింపు చేసుకొని బాహ్య సమాజానికి సుదూరంలో వున్న అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ తెగల అభివృద్ధి గురించి ఆలోచన చేశారు. 

5,6 షెడ్యూళ్ల ప్రదాత

1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో 744 తెగల ఆదిమ గిరిజన జీవితాలను మెరుగుపరిచేందుకు రాజ్యాంగంలో 5,6 షెడ్యూళ్లను ప్రత్యేకంగా ప్రవేశ పెట్టడం జరిగింది. ఐదవ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కేరళ, బీహార్, కర్ణాటక రాష్ట్రాలు; ఆరవ షెడ్యూల్లో జార్ఖండ్, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, గోవా, మేఘాలయ రాష్ట్రాల్లోని వివిధ తెగల ఆదివాసీలు సుమారు 10.4 కోట్ల మంది (దేశ జనాభాలో 8.6 శాతం) ఉన్నారు. 5వ షెడ్యూల్ భూభాగంలోని గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు కల్పించగా ప్రత్యేకంగా 6వ షెడ్యూల్ భూభాగంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజనులకు స్వయం పరిపాలనాధికారాలు కల్పించారు. రాజ్యాంగంలో లిఖించిన12 షెడ్యూళ్లలో అంబేద్కర్ ప్రత్యేకించి రెండు షెడ్యూళ్లు (5,6) గిరిజనులకు కేటాయించడం గొప్ప వరం. కాని దేశానికి స్వాతంత్య్రం లభించి 74 ఏళ్లు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా రాజ్యాంగంలో కల్పించబడ్డ ఆదివాసీ హక్కులు, రిజర్వేషన్లు, రక్షణచట్టాలు సరిగా అమలు కావట్లేదు. ‘దున్నేవాడికే భూమి’ చెందాలనే ఆర్థికవాద సిద్ధాంతం ననుసరించి భూమితోపాటు ప్రకృతి వనరులు, ఆర్థిక సంస్థల్ని జాతీయం చేయాలన్నారు. కులం,  ప్రకృతి వనరులు, ఆర్థిక సంస్థల్ని జాతీయం చేయాలన్నారు. కులం మీద ఒక జాతిని నిర్మించలేమని అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను తుడిచివేయాలని కోరుకున్నారు. తన ఆశయాన్ని కళ్లారా చూడని  ఆయన 1956, డిసెంబర్ 6న కన్ను మూసారు.

హక్కులను కాపాడాలి

దేశంలో ఇంతకాలం నిరాదరణకు గురైన కుల, మత, ప్రాంత, జాతి తదితర వివిధ అస్థిత్వాల వారి వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికల్ని రూపొందించాల్సిన ప్రభుత్వాలు అటవీ వనరులను దోచుకునేందుకు ఆదివాసీ  ప్రాంతాలను బహుళజాతి కంపెనీల అనుకూల అభివృద్ధి పంథాను అనుసరిస్తున్నాయి. నేడు అస్థిత్వపోరాటంలో ఎదురీదుతున్న ఆదివాసీలు, వీరి రిజర్వేషన్లలో అసమతుల్యత వల్ల దిక్కుతోచని స్థితిలో పరాధీనతకు, నిరాదరణకు గురవుతున్నారు. ఆదివాసీలు వారసత్వంగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు, రుణ సదుపాయం కల్పించడం లేదు. స్వార్థ రాజకీయ లబ్ది కోసం వివిధ పాలక వర్గాలు కొన్నేళ్లుగా అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలే అంబేద్కర్ ఆశయ సిద్ధిని ఆటంకపరుస్తున్నాయి. అణగారిన వర్గాల రిజర్వేషన్లతో పాటు, ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ పదోన్నతులను కొనసాగించాలి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పాలన సవ్యంగా సాగిస్తే దేశంలోని అణగారిన ప్రజలు  మరింతగా అభివృద్ధి చెందుతారని  ఆశిద్దాం. - గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి.