నరేశ్​ ఎక్కడా.. సస్పెన్స్​ థ్రిలర్​ను తలపిస్తున్న జీడిమెట్ల కాల్పుల ఘటన

నరేశ్​ ఎక్కడా.. సస్పెన్స్​ థ్రిలర్​ను తలపిస్తున్న జీడిమెట్ల కాల్పుల ఘటన
  • అసలు ఆ గన్​ ఎక్కడి నుంచి వచ్చింది? 
  • పోలీసుల తీరుపై అనుమానాలు

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పోలీస్​స్టేషన్ ​పరిధి గాజులరామారంలో జరిగిన కాల్పుల ఘటన సస్పెన్స్ థ్రిలర్​ను తలపిస్తోంది.  కాల్పులు జరిపిన మల్లంపేట్​కు చెందిన బీఆర్ఎస్​ లీడర్​నరేశ్​ను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేస్తుండడం, వారు చేసే ప్రకటనలకు బయటకు వస్తున్న వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు పూర్తిగా భిన్నంగా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి.

 గాజులరామారం ఎల్ఎన్​ బార్​వద్ద పార్క్​ చేసిన బైక్ నుంచి మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళతోపాటు మరో ఇద్దరు పెట్రోల్ తీస్తుండడంతో.. బార్​ క్యాషియర్ అఖిలేశ్ ​గొడవ పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సదరు మహిళ ఫోన్​ చేయడంతో నరేశ్ ఘటనాస్థలానికి చేరుకొని అఖిలేశ్​పై కాల్పులు జరపగా, అతడు తప్పించుకున్నాడు. అనంతరం బార్​ ఓనర్​ను థార్​వాహనంతో ఢీ కొట్టారు. దీంతో ఈ పంచాది  జీడిమెట్ల పోలీస్​స్టేషన్​కు చేరింది. బీఆర్ఎస్ నేత అయిన నరేశ్​ పోలీసుల ముందే బార్​ సిబ్బందిని దుర్భాషలాడుతూ జీవితం లేకుండా చేస్తానని బెదిరించాడు. 

అయిన్పటికీ అతడిని పోలీసులు వదిలేశారు. తీరా కాల్పులు విషయం బయటకు రావడంతో మళ్లీ నరేశ్​ కోసం గాలింపు చేపట్టారు. గురువారం సాయంత్రం వరకూ నరేశ్ ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. ఈ నాటకీయ పరిణామాల మధ్యే శివ అనే వ్యక్తి కాల్పులు తానే జరిపినట్లు గురువారం ఉదయం లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. సీసీ ఫుటేజీలో మాత్రం నరేశ్​ కాల్పులు జరుపుతున్నట్లు కన్పిస్తోంది. 

ఘటనకు సంబంధించిన ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నరేశ్​పై దుండిగల్​ పోలీస్​ స్టేషన్​లో గతంలో పలు కేసులు నమోదయ్యాయి.  కబ్జాలపై సైతం అతడిపై అనేక ఆరోణలు ఉన్నాయి. తనకు ఉన్న పరిచయాలతో కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నరేశ్​ పోలీసుకు చిక్కితే గన్​ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు తెచ్చారు? ఎన్నిరోజులుగా గన్​తో తిరుగుతున్నాడనే విషయాలు బయటకు వచ్చే అవకావశం ఉంది.