వినాయకుడి పండుగ వచ్చేసింది. రంగురంగుల పూలు, బుగ్గలతో అలంకరించిన మండపాల్లో బొజ్జ గణపయ్యని పూజించేందుకు రెడీ అవుతున్నారంతా. అయితే, ఈమధ్య ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు కొంటున్నారు చాలామంది. మట్టి గణేశుడిని పెరట్లోనే నిమజ్జనం చేసుకునేలా మొలకెత్తే గణేశుడి విగ్రహాలు తయారుచేస్తున్నారు కొంతమంది. వీళ్లలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గుణకలీ భోంస్లే ఒకరు.
గుణకలీ కుటుంబంలో అందరికీ సంగీతం అంటే చాలా ఇష్టం. గుణకలీ సితార్ విద్వాంసురాలు. ప్రతి ఏడాది వినాయకచవితికి ఇంటి దగ్గర వాళ్ల నాన్న మట్టి వినాయకుడిని తయారుచేసేవాడు. తండ్రిని చూసి ఆమె కూడా గణపయ్య తయారీ నేర్చుకుంది. అంతేకాదు వాటికి వాటర్ కలర్స్ వేసేది. దాదాపు ఆరేండ్ల నుంచి మట్టితో పాటు ఎండిన ఆకులు, ఆవు పేడ, కాగితం గుజ్జు కలిపి విగ్రహాలు చేస్తోంది గుణకలీ. అంతేకాదు వాటిలో పండ్లు, కూరగాయలు, పూల మొక్కల విత్తనాల్ని పెడుతోంది. పూజించిన తర్వాత వినాయకుడిని పెరట్లో లేదా పొలం దగ్గర నిమజ్జనం చేయొచ్చు. వాటి మీద నీళ్లు పోస్తే రెండు మూడు రోజులకి మొలక వస్తుంది. ఈ ఏడాది కూడా నాలుగొందలకు పైగా ఇలాంటి విగ్రహాలు తయారుచేసింది.
పచ్చదనం పెరుగుతుంది
‘‘కిందపడిన చెట్ల ఆకుల్ని ఏరుకొస్తాం. వాటిని ఎండబెట్టి, పొడి చేస్తాం. ఈ పొడికి ఆవుపేడ, కాగితం గుజ్జు, మట్టి కలిపి వినాయకుడి విగ్రహాలు తయారుచేస్తాం. ఇవి గట్టిగా ఉంటాయి. అంతేకాదు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వాటికంటే వీటి ధర తక్కువ. ఈ విగ్రహాల్ని పూజించడం వల్ల పర్యావరణం కలుషితం కాదు. పెరట్లో నిమజ్జనం చేస్తే పచ్చదనం పెరుగుతుంది” అని చెప్పింది గుణకలీ భోంస్లే.