- చిన్నప్పుడు చదివిన పాఠశాల రూపురేఖలు మార్చిన గుండా మధుసూదన్
- కంప్యూటర్ ల్యాబ్, డిజిటర్ లైబ్రరీ, సైన్స్, సోషల్ ల్యాబ్ ఏర్పాటు
- మహిళా సాధికారత కోసం కృషి
యాదాద్రి, వెలుగు: విద్య, ఉద్యోగ, వ్యాపారరంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న పలువురు సొంతూళ్ల అభివృద్ధిపై ఫోకస్‌పెట్టారు. అలాంటి కోవలోకే వస్తారు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్. హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో రాణిస్తున్న గుండా మధుసూదన్ తన తండ్రి ‘గుండా సత్తయ్య మెమోరియల్’, సుమధుర ఫౌండేషన్ పేర్లతో స్వగ్రామం ఇస్కిళ్ల, చుట్టు పక్కల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.
ఇస్కిళ్లలో చిన్నతనంలో తాను చదువుకున్న ప్రైమరీ స్కూల్ శిథిలావస్థకు చేరుకోగా, రూ. 2 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా కొత్త బిల్డింగ్నిర్మించారు. ఈ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్, డిజిటర్ లైబ్రరీ, సైన్స్, సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాఠశాలను ప్రారంభించగా, మధుసూదన్ నలుగురు వలంటీర్లు, ముగ్గురు హౌస్ కీపర్స్‌ను ఏర్పాటు చేసి వేతనాలు అందిస్తుండడం విశేషం. ఇస్కిళ్లతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోని మహిళలకు కంప్యూటర్, కుట్టు శిక్షణ, మగ్గం వర్క్ లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. గ్రామంలో ఫ్యూరీ ఫైడ్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటుచేసి, ఇంటింటికీ సురక్షిత నీళ్లు అందిస్తున్న మధుసూదన్‌పై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సొంతూరు కోసం
ఎంత చేసినా తక్కువే: పుట్టిన ఊరు, కన్న తల్లితో ఎప్పటికీ రుణం తీరదు. అందుకే సొంతూరు బాగుకోసం ఎంత చేసినా తక్కువే. అందుకే నాకు తోచినంతలో గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాను. నేను సంపాదించిన దానిలో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతోనే సుమధుర ఫౌండేషన్‌ను స్థాపించి, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తా.గుండా మధుసూదన్,
చైర్మన్, సుమధుర ఫౌండేషన్