అంకుర ఫ్రాడింగ్ మోసం రూ.100 కోట్లకు పైనే..!

అంకుర ఫ్రాడింగ్ మోసం రూ.100 కోట్లకు పైనే..!
  • షేర్​ మార్కెట్​లో పెట్టుబడుల పేరిట భారీగా వసూళ్లు 
  • ఐదు జిల్లాల్లో బాధితులు  
  • 2 నెలలుగా మూసి ఉన్న హైదరాబాద్​ ఆఫీస్​  
  • నిందితుడు విదేశాలకు వెళ్లాడనే ప్రచారం
  • మిస్సింగ్​ అంటూ తల్లి ఫిర్యాదు   

మంచిర్యాల/జైపూర్, వెలుగు : షేర్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​మెంట్​ పేరిట గుండా సురేశ్​ రూ.వంద కోట్లకు పైగా ఫ్రాడ్​ చేసినట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్​కు అధిక వడ్డీ ఆశచూపి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. మంచి ర్యాల, నిర్మల్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​, నల్గొండ, హైదరాబాద్​ ప్రాంతాలకు చెందిన వారు మోసపోయినట్టు చెప్తున్నారు.

ఇప్పటికే పలువురు వరంగల్, హైదరాబాద్​ జుబ్లీహిల్స్​ పీఎస్​లలో ఫిర్యాదు చేయగా, సురేశ్​పై కేసులు నమోదు చేసి టాస్క్​ఫోర్స్​తో ఎంక్వయిరీ చేయిస్తున్నట్టు తెలిసింది. సురేశ్​ ఇటీవల విదేశాలకు పారిపోయినట్టు ప్రచారం జరుగుతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం విద్యానగర్​లోని వారి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను నిలదీస్తున్నారు.  

అధిక వడ్డీ ఆశచూపి మోసం.. 

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం రామారావుపేటకు చెందిన గుండ సురేశ్​ ఎనిమిదేండ్లుగా హైదారాబాద్​లో ఉంటున్నాడు. మొదట్లో  షేర్​ మార్కెట్​ బ్రోకర్​గా పనిచేసిన అతడు నాలుగేండ్ల కింద అంకుర కార్పొరేట్​ సొల్యూషన్స్​ పేరుతో బిజినెస్​ స్టార్ట్​ చేశాడు. హైదరాబాద్​  జూబ్లీహిల్స్​ రోడ్​ నంబర్ 36లోని వెస్టెండ్​మాల్​లో ఆఫీస్​ ఓపెన్​ చేశాడు. సంస్థకు  సీఈవో కమ్​ డైరెక్టర్​గా కొనసాగుతున్నాడు. వివిధ జిల్లాల్లోని తన ఫ్రెండ్స్​ను ఎంప్లాయీస్​గా, ఏజెంట్లుగా నియమించుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్​కు 5 నుంచి 10 శాతం వడ్డీ ఆశచూపి కోట్లలో పెట్టుబడులు పెట్టించాడు. ఎంప్లాయీస్  ద్వారా వివిధ జిల్లాలకు చెందిన వారితో భారీగా వసూళ్లు చేశాడు. కస్టమర్లకు సుమారు మూడేండ్లు నెలనెలా వడ్డీ చెల్లించాడు. దీంతో అతడిని గుడ్డిగా నమ్మి కోట్లలో పెట్టుబడులు పెట్టినవారు ఇప్పుడు అసలుకే ఎసరు రావడంతో ఆందోళన చెందుతున్నారు.  

రెండు నెలల కిందటే ఆఫీస్​ క్లోజ్..

షేర్ ​మార్కెట్​లో నష్టం వచ్చిందని ఎంప్లాయీస్​తో చెప్పిన సురేశ్​ రెండు నెలల కింద జూబ్లీహిల్స్​లోని అంకుర కార్పొరేట్ సొల్యూషన్స్​ఆఫీస్​ క్లోజ్​ చేశాడు. తనకు హెల్త్​ బాగా లేదని, మంచిర్యాలలోని ఇంటికి వెళ్తున్నానని, ఈ నెల 8న తర్వాత కలుస్తానని చెప్పాడు. వారం నుంచి అతడి ఫోన్​ స్విచ్ఛాఫ్​ వస్తోందని, హైదరాబాద్​ కాకతీయ హిల్స్​లో ఇంటిని కూడా ఖాళీ చేశాడని బాధితులు తెలిపారు. అతడు ఎక్కడికి వెళ్లాడన్న సమాచారం లేకపోవడంతో ఎంప్లాయీస్​తో పాటు కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.  

వరంగల్​, హైదరాబాద్​లో ఫిర్యాదులు..

సురేశ్​పై వరంగల్​ సిటీ, హైదరాబాద్​ జూబ్లీహిల్స్​పీఎస్​లలో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అతడు విదేశాలకు పారిపోయినట్టు ప్రచారం జరుగుతుండడంతో మంచిర్యాల విద్యానగర్​లోని ఇంటికి వచ్చి ఆరా తీస్తున్నారు. అయితే, సురేశ్​ మంచిర్యాలకు రాలేదని, ఎటు వెళ్లాడో, ఏమయ్యాడో తమకు తెలియదని తల్లిదండ్రులు, భార్య, కుటుంబసభ్యులు చెప్తున్నారు. సురేశ్ కనిపించడం లేదంటూ ఆయన తల్లి మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెండు మూడు రోజుల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్వెస్టర్లు మంచిర్యాలకు వచ్చి అతడి గురించి కుటుంబసభ్యులను ఆరా తీస్తున్నారు. వరంగల్, జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్లలో నమోదైన కేసులపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నట్టు సమాచారం. 

లబోదిబోమంటున్న బాధితులు..

సురేశ్​ను నమ్మి అంకుర కార్పొరేట్​ సొల్యూషన్స్​లో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమంటున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలానికి చెందిన కుటుంబసభ్యులు, బంధువుల దగ్గర సుమారు రూ.4 కోట్లు సురేశ్​ వసూలు చేసినట్టు తెలిసింది. మంచిర్యాలకు చెందిన పలువురు రూ.5 కోట్లకు పైగా పెట్టిబడి పెట్టినట్టు సమాచారం. హన్మకొండకు చెందిన అంకుర సంస్థ ఎంప్లాయ్​ఒకరు తన బంధువులు, ఫ్రెండ్స్​తో సుమారు రూ.13 కోట్లు ఇన్వెస్ట్​ చేయించినట్టు చెప్తున్నారు. అధిక వడ్డీ ఆశతో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టినవారు ఇన్​కమ్​టాక్స్​ భయంతో బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి ‘అంకుర’లో డబ్బులు పెట్టిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సురేశ్​ మిస్సింగ్​పై కంప్లయింట్​ వచ్చిందని చెప్పిన పోలీసులు.. ఫ్రాడింగ్​పై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు.