పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గుండం చెరువు ఇష్యూ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని వెంటాడుతోంది. మొన్నటి దాక ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్‌ను టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు చేయగా.. తాజాగా సొంత పార్టీ నేతలే ట్రోలింగ్ చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నాడని ప్రతిపక్ష నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ప్లీనరీ తర్వాత బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇతర లీడర్ల నుంచి అసమ్మతి స్వరం వినిపించింది. సొంతపార్టీ లీడర్ల నుంచి నెగెటివ్ వాయిస్ రావడంతో హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఎన్నికల ఏడాది కావడంతో అధికార, ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే దాసరిపై చేస్తున్న అవినీతి ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
సొంత పార్టీ నుంచే ఆరోపణలు..
పెద్దపల్లి బ్యూటిఫికేషన్‌లో భాగంగా 2016లో గుండం చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేయాలని నిర్ణయించారు. దీనికోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా రూ.3.5 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఒక్క మీటింగ్‌లోనే ఎల్లమ్మ గుండంచెరువుకు రూ.1.20 కోట్లు కేటాయించడం, హరితహారంలో భాగంగా రూ. కోటి ఖర్చు చేయడం వంటి వాటిపైనా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా సొంత పార్టీ కౌన్సిలర్భర్త మున్సిపాలిటీలో అవినీతి జరుగుతోందని చెప్పడం, దానిని నిరూపిస్తానని సవాల్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లయింది. పెద్దపల్లి టికెట్‌ను ఆశిస్తున్నవారి లిస్ట్ పెరుగుతుండడంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇవే తాజా అసమ్మతులకు కారణమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలోనూ, ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లోనూ ఇదే అసమ్మతి కనిపిస్తోంది. ఈక్రమంలోనే తాజాగా గుండం చెరువు ఇష్యూ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేపై ప్రతిపక్షాల ఆరోపణలు
పెద్దపల్లి బ్యూటిఫికేషన్‌లో భాగంగా గుండం చెరువుపై మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల్లోనూ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీఏ ద్వారా సమాచారం సేకరించిన కాంగ్రెస్కౌన్సిలర్లు, ఇతర లీడర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు పెద్దపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత పార్టీ కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు. మీటింగుల్లో ఎలాంటి చర్చ లేకుండానే తీర్మానాలు చేసి ఫండ్స్ కేటాయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ బడ్జెట్‌లోనూ అవకతవకలు జరిగాయని, చేయని పనులకు కూడా బిల్లులు పెడుతున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. తాజా పరిస్థితులు బీఆర్ఎస్ హైకమాండ్‌కు చేరినట్లు తెలుస్తోంది.
చర్చకు తావు లేకుండా చేస్తున్నరు
మున్సిపాలిటీలో ఎలాంటి చర్చకు తావు లేకుండానే తీర్మానాలు జరుగుతున్నాయి. బడ్జెట్ కూడా అలాగే ఆమోదించారు. మున్సిపాలిటీ జనరల్ఫండ్ను ఎమ్మెల్యే సూచన మేరకు అభివృద్ధి పనులకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే మున్సిపాలిటీ పాలన నడుస్తోంది. ప్రతిపక్ష కౌన్సిలర్లకు మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదు. బల్దియాలో నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరపాలి.
- భూతగడ్డ సంపత్, కాంగ్రెస్ కౌన్సిలర్