వరద నష్టాన్ని అంచనా వేయండి: గుండు సుధారాణి

వరద నష్టాన్ని అంచనా వేయండి:  గుండు సుధారాణి

వరంగల్‌‌ సిటీ, వెలుగు : భారీ వర్షాలకు గ్రేటర్‌‌ పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఇంజినీరింగ్‌‌, టౌన్‌‌ ప్లానింగ్‌‌, రెవెన్యూ, శానిటేషన్‌‌, డీఆర్‌‌ఎఫ్‌‌ విభాగాలకు చెందిన ఆఫీసర్లు, సిబ్బందితో సోమవారం బల్దియా హెడ్‌‌ ఆఫీస్‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల టైంలో సిబ్బంది మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయని, కార్పొరేటర్ల సహకారంతో నష్టాన్ని అంచనా వేస్తే ప్రభుత్వానికి రిపోర్టు పంపిస్తామని చెప్పారు. 

బిల్‌‌ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇండ్ల సమగ్ర సమాచారాన్ని ఏరియా, డివిజన్ల వారీగా అందజేయాలని సూచించారు. వరద ముంపునకు గురైన ఏరియాల్లో హెల్త్‌‌ క్యాంప్‌‌లు కొనసాగేలా ఆఫీసర్లతో మాట్లాడాలని చెప్పారు. దెబ్బతిన్న డ్రైన్ల నిర్మాణానికి ప్రపోజల్స్‌‌ రెడీ చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న డీఆర్‌‌ఎఫ్‌‌ టీంకు సమాంతరంగా 27 మందితో మరో టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రివ్యూలో ఇన్‌‌చార్జి అడిషనల్‌‌ కమిషనర్‌‌ అనిసుర్‌‌ రషీద్, ఆర్‌‌ఎఫ్‌‌వో పాపయ్య, ఎస్‌‌ఈలు ప్రవీణ్‌‌చంద్ర, కృష్ణారావు, సీహెచ్‌‌వో శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్‌‌వో శంకర్‌‌ లింగం, డిప్యూటీ కమిషనర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి పాల్గొన్నారు.