గుడిమల్కాపూర్ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో కాల్పుల కలకలం

గుడిమల్కాపూర్ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో కాల్పుల కలకలం

మెహిదీపట్నం, వెలుగు: గుడిమల్కాపూర్ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్​లో తుపాకీ కాల్పులతో కలకలం రేగింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. కుల్సుంపురా ఏసీపీ మునువర్, సీఐ రాజు, స్థానికుల కథనం ప్రకారం.. నెల రోజులుగా కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో ఆనం మీర్జా ఎక్స్ పో నడుస్తోంది. శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అందులోని ఫర్​ఫ్యూమ్ షాప్​యజమాని మోహిష్ అహ్మద్ ఇంతియాజ్, టాయ్స్ షాప్​యజమాని సయ్యద్ ఆమన్ మధ్య గొడవ జరిగింది.

నిర్వాహకుడు మీర్ హసిబుద్దిన్ అలియాస్ హైదర్ ఇరువురిని సముదాయించిన వినిపించుకోలేదు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాలిలోకి రెండు రౌండ్లు కాల్చాడు. ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని హైదర్ వద్ద ఉన్న తుపాకీ, 15 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్​చేశారు. హైదర్ పరిగి మండలం పెద్దముల్​గ్రామ మాజీ సర్పంచ్. మాసబ్ ట్యాంక్​ ప్యారా మెంట్ గార్డెన్ ఏసీ గార్డ్స్ లో ఉంటున్నాడు. 2021లో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 0.32 ఎంఎం పిస్తోల్ లైసెన్స్​తీసుకున్నాడు.