ఏపీ వర్ష బీభత్సం కొనసాగుతుంది. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వాగు దాటుతున్న సమయంలో.. ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురూ చనిపోయారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, కాలువలు, పొంగుతున్నాయి. గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. నంబూరులోని ఓ స్కూల్ లో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భారీ వర్షాలతో శనివారం ( ఆగస్తు 31)స్కూల్ కు సెలవు ప్రకటించారు. దీంతో ఆ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర ఇంటికి బయల్దేరారు. ఉప్పలపాడు సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో ఆగకుండా కారు డ్రైవ్ చేయడంతో....వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులోని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్థానికులు కారును వాగులోంచి లాగి, మృతదేహాలను బయటకు తీశారు.మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్విక్‌గా గుర్తించారు.
మంగళగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా వరద
గుంటూరు జిల్లా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారులు జలమయం అయ్యాయి. టోల్‍గేట్ వద్ద ప్రధాన రహదారిపై మోకాలి లోతులో వరద నీరు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. టోల్ ప్లాజా ప్రాంతం వరద నీటితో జలాశయాన్ని తలపిస్తుంది. జాతీయ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అవసరం లేకుండా ప్రజలు రోడ్డుపైకి రావద్దని ఇళ్లలోనే ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలయమై చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, కృష్ణా, కాకినాడ, అల్లూరి మన్యం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురిని మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో మృతుడిని కోల్‌కతాకు చెందిన కార్మికుడిగా అనుమానిస్తున్నారు.
విజయవాడ, గుంటూరులో భారీ వర్షాలు
భారీ వర్షాలకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నిడమానూరు-పోరంకి ప్రధాన రహదారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయవాడ, గుంటూరులలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యను కాల్ సెంటర్ కు తెలియజేసి తక్షణ సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు.
విజయవాడలో గత రాత్రి ( ఆగస్తు30) నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్‌లో మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనుక చెట్టు కూలిపోయి అక్కడే ఉన్న ఆటో, కారుపై పడడంతో ఆటో, కార్ డ్యామేజ్ అయ్యాయి.
అక్కడ మనుషులు ఎవరూ లేపడంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న కరెంటు పోల్ పై చెట్టు పడడంతో కరెంటు వైర్లు కూడా తెగి నేల మీద పడ్డాయి. స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పక్కనే ఉన్న వేప చెట్టు కూడా పడిపోయే స్థితిలో ఉండగా వర్షం ఆగిన వెంటనే ఆ చెట్టును కూడా తొలగిస్తామని అధికారులు చెప్పారు.
కృష్ణానది వరద ప్రవాహం
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 రోజుల వ్యవధిలో రెండోసారి వరద తాకిడితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పడవ ద్వారా పాతఎడ్లంక గ్రామస్తులు, రైతులు నదీ పాయ దాటుతున్నారు.