వరంగల్ రిషితేశ్వరి కేసును కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు.. కన్నీటి పర్యంతమైన తల్లి

గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయందని ప్రత్యేక కోర్టు తెలిపింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ర్యాగింగ్, వేధింపుల వల్ల 2015, జులై 14న వరంగల్కు చెందిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. రిషితేశ్వరి నాగార్జున వర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు విద్యార్థిని.

ర్యాగింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు రిషితేశ్వరి రాసిన నోట్ పోలీసులకు లభ్యమైంది. ఈ కేసు విచారణ గుంటూరు కోర్టులో తొమ్మిదేండ్ల పాటు సుదీర్ఘంగా సాగింది. 2024, నవంబర్ 29న రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేయడంతో ఆమె తల్లిదండ్రులు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం.. రిషితేశ్వరి తల్లి మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూశామని, ఇక ఓపిక లేదు అని కోర్టు ఆవరణలోనే విలపించింది. రిషితేశ్వరిని ఫ్రెషర్స్ పార్టీలో సీనియర్లు లైంగికంగా వేధించారని, ఆ విషయం ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె పేరెంట్స్ చెప్పుకొచ్చారు. నిందితుల పేర్లు డైరీలో ఉన్నాయని, ఆ డైరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియడం లేదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అన్యాయం జరిగిందని ఆరోపించిన ఆమె తల్లిదండ్రులు, ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.