- పోరాడే ఓపిక లేదు: రిషితేశ్వరి తల్లి
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు తీర్పు వెల్లడించింది. నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని వ్యాఖ్యానించింది. వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సులో చేరింది. 2015 జులై14న ఆత్మహత్య చేసుకుంది. వర్సిటీలో జరిగిన ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసింది.
సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు తెలిపింది. అప్పట్లో రిషితేశ్వరి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును తొమ్మిదేండ్లుగా గుంటూరు కోర్టు విచారిస్తున్నది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
రిషితేశ్వరి కేసును న్యాయస్థానం కొట్టివేయడంపై బాధితురాలి తల్లితండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదన్నారు. ఇక్కడ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఇక పోరాడే ఓపిక లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.