
డేరా బాబా అలియాస్ డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరోసారి పెరోల్ పై జైలునుంచి బయటికి వచ్చాడు. డేరా బాబాకు 21 రోజులు పెరోల్ మంజూరు చేసింది హర్యానా ప్రభుత్వం. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశాడన్న కేసులో దోషిగా రోహ్ తక్ జైలులో 20యేళ్ళ శిక్ష అనుభవిస్తున్నాడు డేరాబాబా. 2017లో దోషిగా తేలినప్పటినుంచి రామ్ రహీమ్ జైలు నుంచి బయటికి రావడం ఇది 13వ సారి.
ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డేరా బాబాకు 30 రోజుల పెరోల్ లభించింది. తాజాగా బుధవారం(ఏప్రిల్ 9) పెరోల్ లభించడంతో డేరాబాబా భారీ బందోబస్తు మధ్య హర్యానాలోని సిర్సా డేరా ప్రధాన కార్యాలయానికి చేరారు. 21రోజులు అక్కడే బస చేయనున్నారు.డేరాబాబాను తీసుకెళ్లేందుకు అతనికి సన్నిహితురాలు హనీప్రీత్ కౌర్ స్వయంగా జైలుకు వచ్చారు. భారీ బందోబస్తు మధ్య సిర్సాకు వెళ్లారు.
డేరాబాబాకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్,ఇతర రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇచ్చిన పెరోల్ అన్నీ ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలోనే వచ్చాయి. అక్టోబర్ 2024లో కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు డేరాబాబా పెరోల్ పై జైలునుంచి బయటికి వచ్చారు. మూడునెలల తర్వాత ఢిల్లీ ఎన్నికలకు ముందు కూడా మళ్లీ జైలునుంచి విడుదలయ్యాడు.
డేరాబాబా తరుచుగా జైలునుంచి పెరోల్ పై విడుదల కావడం విమర్శలకు దారితీసింది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ డేరాబాబా పెరోల్ పై కోర్టులో సవాల్ చేసింది. 2024లో ఈ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఈ కేసు కొనసాగుతుండగానే మరోసారి గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరాబాబాకు మరోసారి పెరోల్ లభించింది.