ఒక్క సినిమాలో కనిపించినా చాలు యాక్టర్లను దాదాపుగా గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. కానీ, టీవీ నటులు అలా కాదు... ఏండ్ల తరబడి ప్రేక్షకులకు కనిపిస్తారు. కాబట్టి ఆటోమెటిక్‌గా సీరియల్ చూసే ప్రతి ఇంట్లో వాళ్లు గుర్తుపడతారు. కానీ, అదే యాక్టర్ సినిమాల్లో కనిపిస్తే మాత్రం సరిగా గుర్తుపట్టలేం. కారణం... వాళ్లకు అంత ఇంపాక్ట్ చేసే రోల్ చాలాసార్లు రాకపోవడమే. అయితే, కొందరు మాత్రం సినిమా, సీరియల్ ఏదైనాసరే తమ మార్క్ చూపిస్తారు. అలాంటి నటుల్లో ఒకరు గుర్మిత్ ఛౌదరి. రామాయణం సీరియల్లో రాముడిగా మెప్పించిన అతను.. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌ల మీద ఫోకస్ చేశాడు. ఈ మధ్యనే వచ్చిన కమాండర్ ‘కరణ్ సక్సేనా’ సిరీస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ నటుడి జర్నీ గురించి తన మాటల్లోనే...
మాది బిహార్, భగల్పూర్లో ఉన్న జైరాంపూర్ గ్రామం. కొవిడ్ తర్వాత అక్కడ ఒక ఫౌండేషన్ మొదలుపెట్టా. అక్కడ నా పెద్ద అన్నయ్య జనరల్ ఫిజీషియన్. నేను యాక్టర్, మోడల్, మార్షల్ ఆర్టిస్ట్‌ని. నేను ఆరో తరగతి చదివేటప్పుడు మా సార్ నన్ను ‘నువ్వేం కావాలి అనుకుంటున్నావ్?’ అని అడిగాడు. ‘యాక్టర్’ అని చెప్పా. నా సమాధానం విన్న ఆయన నేను జోక్ చేస్తున్నా అనుకున్నారు. ఎందుకంటే మాది ఆర్మీ ఫ్యామిలీ. సినిమా ఇండస్ట్రీతో అస్సలు కనెక్షన్ లేదు. కానీ అప్పట్లోనే నాకు మాత్రం ఏదో ఒకరోజు నేను ఇండస్ట్రీలోకి వస్తానని అనిపించింది.
నాన్న కాదనలేదు
చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలిసినా డాన్స్, యాక్టింగ్ చేస్తుండేవాడిని. ఎక్కువగా ‘తు చీజ్ బడీ హై మస్త్...’ అనే పాటకు డాన్స్ చేసేవాడిని. నా డాన్స్‌ని అందరూ మెచ్చుకునేవారు. నాన్న ఆర్మీలో చేయడం వల్ల చిన్నప్పుడు చాలా ప్లేసులకు తిరిగాం. కానీ, దయాళ్‌పూర్‌లో సెటిల్ అయ్యాం. వేసవిలో అక్కడికి చాలాసార్లు వెళ్తుంటాం. అప్పట్లో టీవీ అంటే సరిగా తెలియదు. ఎందుకంటే మేం ఉన్నది చాలా వెనకబడిన గ్రామంలో. సినిమా చూసేటప్పుడు నేను ముందు వరుసలో కూర్చుని యాక్టర్స్‌ని బాగా గమనించేవాడిని.
సినిమా చూడడం అయిపోయాక అందులో చూసిన సీన్లను ఇంట్లో వాళ్ల ముందు నటించి చూపించేవాడిని. ‘మొహ్రా’ సినిమా రిలీజ్ అయినప్పుడు ‘తు చీజ్ బడీ హై మస్త్...’ అనే పాటకు డాన్స్ చేసేవాడ్ని. అది చూసి అందరూ ‘నేచురల్‌గా చేస్తున్నావ్’ అని మెచ్చుకునేవాళ్లు. అలా పొగడ్తలు విన్న నాలో ఇంకా చాలా చేయగలను అనే ధీమా పెరిగింది.
పదహారేళ్ల వయసులో ‘యాక్టింగ్ నా కల. నా కెరీర్ అదే. ముంబయి వెళ్తా’ అని నాన్నకు చెప్పా. నా డాన్స్, నటనను అందరూ మెచ్చుకోవడం తెలిసిన నాన్న నా కోరిక కాదనలేకపోయారు. వెంటనే ఒప్పుకున్నారు. ఎన్నో ఆశలతో.. చేతిలో చాలా తక్కువ డబ్బుతో ముంబయికి చేరుకున్నా. మొదట ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరా. అక్కడ డబ్బు ఎక్కువగా ఖర్చు కావడంతో మానేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి వదిలి వెళ్లలేక.. ఇనిస్టిట్యూట్లోనే స్వీపర్ల దగ్గరే పడుకున్నా. ఆ టైంలో నా ఫ్రెండ్ సందీప్.. నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ‘నువ్వు నాతో రా. నాతోనే ఉండు’ అన్నాడు.
ఒకప్పుడు ఆటో ఎక్కితే రిచ్!
కొలాబా ఆర్మీ కంటోన్మెంట్లో గెస్ట్‌గా ఉండేవాడిని. అక్కడ రోజుకి 40 రూపాయల అద్దె. రోజూ కొలాబా రైల్వే స్టేషన్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ ఉండే అంధేరిలోని బాంద్రాకు వెళ్లేవాడిని. ఆడిషన్స్ కోసం తిరిగేటప్పుడు రోజుకు 40 రూపాయలు ఖర్చయ్యేవి. కొంతకాలం తర్వాత నా ఫ్రెండ్ బైక్ తీసుకెళ్లి రోజుకు నాలుగైదు ఆడిషన్లు ఇచ్చేవాడిని. ఒక్క అవకాశం రాకపోదా అనే ఆశతో తిరిగేవాడిని. అయితే ఎప్పుడైనా ఆటోలో వెళ్తే రిచ్‌గా ఫీలయ్యేవాడిని.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా. రోజుకు పది ఆడిషన్లు ఇచ్చేవాడిని. నాలుగేండ్ల తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. అక్కడ కొంత టైం మాత్రమే యాక్టింగ్ చేసే స్కోప్ దొరికేది. అయినా వదలకుండా అదే చేస్తుండడంతో ‘రామాయణ్’ అనే టెలివిజన్ సీరియల్లో రాముడి పాత్రకు సెలక్ట్ అయ్యా. అప్పటికి నా వయసు 24 ఏండ్లు. ఆ సీరియల్ టెలికాస్ట్కు ముందు మా నాన్న నన్ను కలిసేందుకు వచ్చారు. ఒక రోజు సాయంత్రం ఆయన్ని నేను బైక్ మీద ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లా. ఒకచోట ఆగి.. ఎదురుగా ఉన్న బిల్ బోర్డ్‌ని చూపించా.
అది చూసిన నాన్న నన్ను గట్టిగా హత్తుకున్నారు. నిజానికి నాన్న ఎమోషన్స్ పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేయడు. అలాంటిది ఆయన ఆ రోజు అలా చేశాడంటే నాకది చాలా పెద్ద విషయం. ఆ సీరియల్‌తో ఎంత పాపులారిటీ వచ్చిందంటే సీరియల్ అయిపోగానే నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. శివుడు, విష్ణువు పాత్రల్లో నటించా. కానీ, ఒకేలాంటి పాత్రల్లోనే చేయాలి అనిపించలేదు. దాంతో వేరే అవకాశాల కోసం చాలాకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.
‘గీత్’ అనే మూవీలో ‘మాన్’ అనే రోల్‌కు సెలక్ట్ అయ్యా. అది నా ఫేవరెట్ రోల్ కూడా. ఆ తర్వాత నేను ఒక కెఫెకి వెళ్లినప్పుడు చాలామంది అమ్మాయిలు వచ్చి నాతో ఫొటోలు దిగారు. అప్పుడు అనిపించింది.. నేను సాధించానేమో! అని. అది జరిగి పదిహేనేండ్లు అయింది. ఈ మధ్యలో ఎన్నో మంచి ప్రాజెక్ట్స్‌లో చేశా. నా వర్క్ లైఫ్ ఎప్పుడూ చాలా బాగుంది. అలాగే పర్సనల్ లైఫ్ కూడా.
ఫిట్నెస్ అంటే అది కాదు
ఫిట్‌గా ఉండడమంటే.. కండలు తిరిగిన దేహం, సిక్స్ ప్యాక్ కాదు. శారీరక ఆరోగ్యం కాపాడుకుంటే మానసిక సమస్యలు కూడా రావు. నేను ఎప్పుడూ ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తుంటా. అందుకే నాకు ఇప్పటివరకు యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలు ఏవీ రాలేదు. అలాగే శారీరకంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నేను ఫిజిక్ మెయింటెయిన్ చేసేది ఏదో చూపించుకుందాం అని కాదు.
ఫిట్‌గా ఉండడానికి మాత్రమే. కాకపోతే దానివల్ల నా కెరీర్‌కి బోనస్ అయింది. ఫిట్‌గా ఉండడం నాకు ఒక అడిక్షన్ అయిపోయింది. షూటింగ్ జరిగేటప్పుడు వెంటవెంటనే యాక్షన్ పార్ట్ ఉన్నా చేశా. 24 గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అలా చేయడం చూసి చాలామంది అవాక్కయ్యారు.
ఆమే నా సీత
దెబీనా, నేను 2006లో రహస్యంగా పెండ్లి చేసుకున్నాం. చాలా దగ్గరి స్నేహితులకి మాత్రమే మా పెండ్లి గురించి తెలుసు. చివరకి మా పేరెంట్స్‌కి కూడా తెలియదు. ఆమె కోసం నేను ఒక ఇల్లు కొనిచ్చే స్టేజీకి వచ్చినప్పుడు అధికారికంగా చెప్పాలనుకున్నాం. 2011లో పెండ్లి గురించి బయటకు చెప్పాం. ‘నచ్ బలీయే’ షోలో మా మ్యారేజీ గురించి అనౌన్స్ చేశాం. నేను ముంబయి వచ్చినప్పుడు దెబీనా తప్ప నాకెవరూ తెలియదు. తన ఫ్రెండ్సే నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ‘ఇక నా వల్ల కాదు’ అనుకున్న టైంలో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిందామె. నాలో ఎంతో స్ఫూర్తినింపింది.
కెరీర్లో బాగున్నానంటే... అది తను ఇచ్చిన మోటివేషన్ వల్లే. ఆమె నా లైఫ్‌లోకి వచ్చాకే నా కెరీర్ ముందుకెళ్లింది. నా భార్య కూడా ఇదే ఇండస్ట్రీ. కాబట్టి నా పాపులారిటీ చూసి హ్యాపీగా ఫీలవుతుంది. ప్రేక్షకుల అభిమానం ఎంతలా ఉందో చెప్పాలంటే మీకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి చంఢీగడ్కి చెందిన 80 ఏండ్ల బామ్మ తన ఇల్లు నాకు రాసివ్వాలి అనుకుంది. దాన్ని తిరస్కరించడానికి లీగల్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ కొందరు ఉంటారు. కొందరు ఫ్యాన్స్ అయితే నేరుగా మా ఇంటికే వచ్చేస్తుంటారు’’
నేను పుట్టింది ఎంటర్టైన్ చేయడానికే. నా లక్ష్యం అదే. దానికోసమే నేను కష్టపడతా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కల కనడానికి ధైర్యం చేశా. తర్వాత దాని వెనకాలే పరిగెత్తా. అందుకే ప్రతి ఒక్కరికీ అదే చెప్తా.. ‘మీకంటూ ఏదైనా డ్రీమ్ ఉంటే.. పట్టు విడవకుండా దాన్నే చేయండి’ అని చెప్తుంటా.