హైదరాబాద్: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవ రెడ్డిని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్ట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంఘం (పీఆర్టీయూటీఎస్) ప్రకటించింది. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశానికి 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో చెన్నకేశవ రెడ్డిన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నాయకుడు పీఎల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గన్నారు.
ఇక.. పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన గుర్రం చెన్నకేశవ రెడ్డి... గతంలో పీఆర్టీయూటీఎస్ లో పలు హోదాల్లో పని చేశారు. 2017–18 కాలంలో పీఆర్టీయూటీఎస్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అంతకు ముందు 2011 నుంచి 2017 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, టీటీజేఏసీ చైర్మన్ గా పని చేస్తూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు.