అమ్మ..నాన్న.. ప్రేమతో పెంచగలరు. తమకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పగలరు. కానీ, గురువు.. సమస్త లోకాన్నీ చదవడం ఎలానో నేర్పిస్తాడు. కష్టం.. సుఖం.. సంతోషం..బాధ.. వీటి మధ్య ఉండే సన్నని గీతను గురువు మాత్రమే చెప్పగలరు. గురువు నేర్పిన పాఠాలే భవిష్యత్ జీవితానికి పునాదులుగా నిలుస్తాయి. సోమవారం (జూలై 3) గురుపూజా మహోత్సవం ఈ సందర్భంగా గురుపూర్ణిమ విశిష్టత మీకోసం..
హిందూమతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది గురు పౌర్ణమి (జూలై 3) సోమవారం జరుపుకుంటారు. గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి? విశిష్టత ఏంటి… గురు పూర్ణిమ ఎందుకు జరుపుకోవాలో ఒకసారి తెలుసుకుందాము ..
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’
భావం: సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి నమస్కారం
గురు బ్రహ్మ..గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
వ్యాస ముహాముని జన్మతిథి
ఆషాఢ శుద్ధపౌర్ణమి వ్యాస ముహాముని జన్మతిథి. ఆనాటి నుంచి ఈ రోజునే గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ఏడాది సోమవారం (జులై 3) గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది. గు అంటే అంధకారం/ చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదాలు చెపుతున్నాయి.
త్రిమూర్తులను పూజించిన ఫలం
పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండడం, దాన్ని గురుపూర్ణిమగా జరుపుకోవడం, ఆరోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ (మత్స్యగంధి),పరాశర మహర్షికి జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాన్ని బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము , అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.
గురు పూర్ణమి నాడు పూజలు
గురువును (వ్యాస భగవానుడిని) స్మరించుకుని, గురు పూర్ణిమ నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. గురు పూర్ణమి చాతుర్మస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. గురువులు ఎక్కడికీ వెళ్లకుండా ఒకేచోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి భూమిక.. ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి, పూజించి, జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
పూజ ఎలా చేయాలి
గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు(జులై 3) ప్రత్యేకమైన రోజు కాబట్టి, తెల్లవారుజామున పూజలు చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజాసామాగ్రి, పూలు, మాలలు, తాంబూలం, వంటి ఇతర పూజా వస్తువులను ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం మీ గురువుగారి దగ్గరకు వెళ్లి, ఆయన పాదాలు కడిగి.. తర్వాత ఆయనకు పూజ చేసి.. మీ శక్తి కొలది పండ్లు, పూలు, స్వీట్లు, డబ్బు మొదలైన వాటిని సమర్పించాలి.
ఈ రోజున చేయాల్సిన పనులు
1. గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించి.. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
2. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురు పూర్ణిమ నాడు అవసరమైన వారికి శనగ పప్పును దానం చేయండి.
3. మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.
4. చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది. గురు పూర్ణిమ రోజున గురువును పూజించి...ఆయన ఆశీర్వాదం తీసుకోండి. వారికి పసుపు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది.
5. పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
6. సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
7. పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.
8. పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం
పౌర్ణమి రోజున చేయకూడని పనులు:
1. ఈరోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను కూడా కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదు. హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది గ్రంధాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ రోజున పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయండి.
2. పౌర్ణమి రోజున, వృద్ధులను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు. వాస్తవానికి, గురు పూర్ణిమ మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది, అయితే ఈ రోజున, పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే.. సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలుగజేస్తాయి.
గురువు అనుగ్రహం కోసం...
మహాభారతాన్ని మనకు అందించిన రోజు ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటారు.ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయడం దానధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది.ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయునికి పూజలు చేస్తారు.
గురు పౌర్ణమి పురాణ గాథ
గురుపౌర్ణమి విశిష్ఠతకు సంబంధించి ఒక చక్కని ప్రాచీన గాథ ఉంది. పూర్వం వారణాశిలో ఓ పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి', ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరు ఇరువురు ప్రతి నిత్యం దైవ ఆరాధనలో, ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. వారు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా వారికి ఇంకా సంతాన భాగ్యం కలగలేదు. అయితే ప్రతిరోజు వ్యాసభగవానులు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని.. వ్యాస మహర్షికోసం ప్రతిరోజు వేయికళ్ళతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వేదవ్యాసుడు ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడై గంగానది స్నానానికి వెళతాడు. అది చూసిన వేదనిధి వెంటనే వారి పాదాలను ఆశ్రయించడంతో .. . దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకున్నాడు. అయినా సరే వేదనిధి ఆయన పాదాలను మాత్రము వదలకుండా ఒకే పనిగా వేడుకున్నాడు. మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.
వేదనిధి మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించి.. అటు పిమ్మట వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీశాడు. ఆ తరువాత వేదనిధిని ఏమి కావాలో కోరుకోమన్నాడు. ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేదనిధి వేడుకున్నాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిచడంతో ... వ్యాసుడిని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరాన జరిగిన విషయాన్ని వివరించాడు. ఆ తరువాత రోజున ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వ్యాస మహర్షి వారిగృహానికి విచ్చేశాడు. దీంతో సంబ్రమాశ్చర్యాలకు లోనైన వేదనిధి దంపతులు మహర్షిని సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజలు చేసి.. ఆ తరువాత దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేశారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహించారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిధ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్ఠులైన ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోమనగా... తాము ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు అని బదులు పలుకుతారు. ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత వేదనిధి.. వేదవతిలకు సంతానం కలుగుతారు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సంతానం కలగడంతోసుఖసంతోషాలతో జీవనం కొనసాగిస్తారు. ఆ తరువాత అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందారు.
వేదవ్యాసుని మానవజాతి మానవాళికంతటికీ గురువుగా భావించారు. హిందూ మతంలో గురువు.. భగవంతునికి.. భక్తునికి మధ్య సంధాన కర్తగా ఉంటారు. . వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. అందుకే వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుతారు.
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
హిందూ సంప్రదాయాలు పాటించే భారతదేశం, నేపాల్, ఇంకా బుద్ధ, జైన సంప్రదాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణమిను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులను స్మరిస్తారు... పూజిస్తారు... బహుమతులు ఇస్తారు.గుడికి వెళ్లి ప్రార్థిస్తారు, దేవుళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడిపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు చేసే మరో మార్గం ఉపవాసం ఉండటం, గురువును పూజించి తాము మరింత కాలం జీవించేందుకు మార్గదర్శకత్వం తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు.