బడులకు తాళాలు వేస్తారా..? క్రిమినల్ కేసులు పెట్టండి: మంత్రి పొన్నం

బడులకు తాళాలు వేస్తారా..? క్రిమినల్ కేసులు పెట్టండి: మంత్రి పొన్నం

హైదరాబాద్: గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, గత ప్రభుత్వం కొన్నేండ్లుగా కిరాయిలు కట్టలేదని, ఇవి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిపడ్డ కిరాయిలు కాదని అన్నారు. 

ప్రభుత్వం వాటిని తప్పకుండా చెల్లిస్తుందని చెబుతున్నప్పటికీ, పిల్లలను బయట ఉంచి తాళాలు వేయడం కరెక్ట్ కాదన్నారు. అద్దె బకాయిలకు సంబంధించిన వివరాలు తెప్పించుకొని వాటిని విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఎవరో చెప్పిన మాటలు విని పాఠశాల భవనాలకు తాళాలు వేయడం కరెక్ట్ కాదని మంత్రి అన్నారు. తాను సంక్షేమ శాఖ మంత్రిగా భవన యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నానని, వెంటనే తాళాలు తీయాలని, లేని పక్షంలో ప్రభుత్వ పరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.

ALSO READ | భేషజాలు వద్దు.. అందరిని కలుపుకోని పోవాలె: టీపీసీసీ చీఫ్

 
పాత బకాయిలు ఇప్పించే బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విద్యా బోధనకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. గురుకులాల ప్రిన్సిపాల్స్, ఆర్సీవోలు ఎక్కడైనా యజమానులు ఇబ్బంది పెట్టనట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు.  తాళాలు వేసిన వారి భవనాలను ఖాళీ చేసి వేరే చోటకు మార్చేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.