జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా

జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా
  • ఎస్సీ గురుకులాల నుంచి 525 మంది అర్హత
  • 204 మందికి 80 శాతానికి పైగా పర్సంటైల్

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్స్– 2025 ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. తొలి సారిగా ఎస్సీ గురుకులాల నుంచి 525 మంది జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. జేఈఈ– 2025 మెయిన్స్ ను రెండు విడతలుగా నిర్వహించగా  90  ఆపై పర్సంటైల్ ను 40 మంది సాధించారని, 80 ఆపై పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 164 మంది ఉన్నారని శనివారం సెక్రటరీ పత్రిక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మంచి పర్సంటైల్ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, అందుకు కృషి చేసిన సిబ్బందిని.. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీవెల్ఫేర్  ప్రిన్సిపల్​సెక్రటరీ ఎన్.​శ్రీధర్ లు అభినందించారని సెక్రటరీ పేర్కొన్నారు. వచ్చే నెల 18న జరుగనున్న  జేఈఈ ఎగ్జామ్ లో ఎక్కువ మంది మంచి ఫలితాలు సాధించి ఐఐటీల్లో సీట్లు సాధించేలా ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నట్టు సెక్రటరీ వెల్లడించారు.  

బీసీ గురుకులాల నుంచి 63 మంది అర్హత

జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బీసీ గురుకులాల నుంచి ఏడుగురు 90 శాతానికి పైగా పర్సంటైల్ సాధించారని సెక్రటరీ సైదులు చెప్పారు. నవదీప్ 97.43 పర్సంటైల్, రాజశేఖర్ రెడ్డి 94.10 పర్సంటైల్, తరుణ్  93.02 పర్సంటైల్, జాహ్నవి 92.08 పర్సంటైల్, స్వాతి  91.82 పర్సంటైల్ సాధించారని శనివారం పత్రిక ప్రకటనలో సెక్రటరీ తెలిపారు. బీసీ గురుకులాల నుంచి మొత్తంగా 63 మంది క్వాలిఫై అయ్యారని ఆయన పేర్కొన్నారు. అర్హత సాధించిన స్టూడెంట్స్ ను బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్అభినందించారు.