
- సర్వేలో ఆందోళనకర విషయాలు వెల్లడి కావడంతో నిర్ణయం
- ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో ఆత్మహత్యల నివారణకు అధికారులు చర్యలు షురూ చేశారు. స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడకుండా గురుకులాల్లోని టీచర్లకు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మానసిక పరివర్తనలపై శిక్షణ ఇప్పించాలని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి నిర్ణయించారు. గురుకుల విద్యార్థుల్లో కుంగుబాటును దూరం చేసి మానసిక ఆరోగ్యం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా దేశంలో ప్రతిష్టాత్మకమైన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్ఎల్ పీ) మాస్టర్ ట్రైనర్ రఫీ నేతృత్వంలో (మ్యాజిక్ ఆఫ్ చేంజ్ సంస్థతో కలిసి) గురుకుల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
సోమ, మంగళవారాల్లో జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగనుంది. తొలి దశలో 120 మందికి, బుధ, గురువారాల్లో మరో 118 మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పడం, విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, విద్యార్థులు విద్యలో మెరుగైన పనితీరు కనబర్చడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
30 వర్సిటీలోని 8,542 మంది స్టూడెంట్లపై స్టడీ
మెల్ బోర్న్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సంయుక్తంగా (ఎన్ఐఐఎంహెచ్ ఏఎన్ఎస్ ) నిర్వహించిన సర్వే పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. పది మంది విద్యార్థుల్లో ఒకరు ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉన్నారని తెలిపింది. తొమ్మిది రాష్ట్రాల్లోని 30 వర్సిటీలకు చెందిన 8,542 మంది స్టూడెంట్ల ప్రవర్తనపై ఈ స్టడీ చేసింది. రెండు శాతం మంది స్టూడెంట్లు ఏడాదిలో ఆత్మహత్య ఆలోచనలు చేయగా.. ఐదు శాతం మంది ఆత్మహత్యయత్నాలు కూడా చేసినట్టు ఈ సర్వే వెల్లడించింది. 40 మంది విద్యార్థులున్న క్లాసులో నలుగురు జీవితంపై ఆశలు కోల్పోయారని, ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారని స్టడీ పేర్కొంది. ఐఐటీ, నిట్, ఐఐఎం స్టూడెంట్లలోనూ సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా ఉందని వివరించింది. పరీక్షల ఒత్తిడి, కుటుంబ సంబంధాలు సరిగ్గా లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని వెల్లడించింది.