టెట్ ఇచ్చి ఏడాదైన అతీ గతీ లేని గురుకుల టీఆర్టీ నోటిఫికేషన్లు.. 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత ఏడాది మార్చి 9 న అసెంబ్లీ లో సీయం వెల్లడించి వాటిలో గురుకుల ఉపాధ్యాయులు 12 వేలు, టీఆర్టీ ద్వారా12 వేలు భర్తీ చేస్తామని వెల్లడించారు. టీచర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం కోసం ఉపాద్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ 2022 మార్చి 24 న జారీ చేసి జూన్ 12 న టెట్ నిర్వహించినారు. 2022 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు తెలంగాణలో 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహించారు. 2022 జూన్ 12 న నిర్వహించిన టెట్ తో కలిపి ఇప్పటి వరకు అన్ని టెట్ పరీక్షల్లో 4 లక్షల మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నారు. మరో 2 లక్షల మంది అభ్యర్థులు టెట్ పాస్ కాని వారు కూడా ఉన్నారు.
మార్చి 24 కి టెట్ నోటిఫికేషన్ జారీ చేసి సంవత్సరం పూర్తి అయింది. కానీ డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న గురుకుల, టీఆర్టీ నోటిఫికేషన్లు ఇంతవరకూ జారీ కాలేదు. గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి దాదాపు 10 నెలలు అయినా ఇప్పటీకీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీని వల్ల 3 లక్షల మంది అభ్యర్థులు గురుకుల ప్రకటన కోసం ఎదురు చూస్తూ తీవ్ర నిరాశ లో ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇంతవరకూ ఇవ్వలేదు. ఇప్పటికైనా గురుకుల టీఆర్టీ ప్రకటనలు విడుదల చేయాలి. - రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం