గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

తుంగతుర్తి, వెలుగు:-  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు.  వాంతులు, విరేచనాలతో బాధపడ్తున్న విద్యార్థినులను  పాఠశాలలో  ఏఎన్ఎం లేకపోవడంతో టీచర్ సాయంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. ఈ మేరకు డాక్టర్ మమత విద్యార్థులను పరిశీలించి ట్రీట్​మెంట్​ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ... రెండ్రోజులుగా తాము కడుపులో నొప్పి, జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నామని చెప్పారు. అస్వస్థతతో ఉంటే ప్రిన్సిపల్​ పట్టించుకోవడంలేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు.  పేద గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న  ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కోరారు.