
కాగజ్ నగర్, వెలుగు : కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల( కాగజ్ నగర్) లో శనివారం మధ్యాహ్నం ఓ స్టూడెంట్ అనారోగ్యంతో చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. గురుకులంలో 9వ తరగతి చదువుతున్న ఎస్. శ్రీవాణిది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రావుల పల్లి. తల్లిదండ్రులు సమ్మయ్య, లలిత. వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీవాణి (14) పెద్ద కూతురు కాగా చిన్న కూతురు ఝాన్సీ. శ్రీవాణి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మెడ నొప్పితో పాటు నీరసంగా ఉన్నట్లు చెప్పడంతో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సునీత ఏఎన్ఎంతో స్టూడెంట్ను సిర్పూర్ టీ సివిల్ హాస్పిటల్ కు పంపించారు.
అక్కడి డాక్టర్లు శ్రీవాణి రక్తహీనతతో బాధపడుతోందని , తల్లిదండ్రులకు చెప్పి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. తర్వాత ఆమెను సిబ్బంది హాస్టల్ కు తీసుకు వచ్చారు. రాత్రి గడిచింది. స్టూడెంట్ ఆరోగ్యం గురించి పట్టించుకోని స్కూల్ సిబ్బంది ఆమెను పరీక్ష రాయించారు. పరీక్ష రాసిన శ్రీవాణి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో వెంటనే అంబులెన్స్ లో సిర్పూర్ టీ సివిల్ హాస్పిటల్ కు మళ్లీ తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఏరియా హాస్పిటల్కు రిఫర్ చేశారు. హాస్టల్ సిబ్బంది అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో రైల్వే గేటు పడి మరింత ఆలస్యమైంది. కాగజ్ నగర్ పట్టణానికి చేరుకున్న తర్వాత స్టూడెంట్ పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో ప్రైవేటు హాస్పిటల్ లో చూపెట్టారు.
అక్కడ ఆశ లేనట్లు చెప్పడంతో కాగజ్ నగర్ లోని ముప్పై పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్ అప్పటికే శ్రీవాణి మృతి చెందినట్లు చెప్పారు. స్టూడెంట్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, అసెంబ్లీ కన్వీనర్ వీరభద్ర చారి, బీఎస్పీ అసెంబ్లీ ఇన్చార్జి అర్షద్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్, సీపీఎం జిల్లా నాయకులు ఆనంద్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు హాస్పిటల్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే స్టూడెంట్ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బతిమిలాడినా కనికరించలే..
తమకూతురిని హాస్టల్ సిబ్బంది పొట్టన బెట్టుకున్నారని, బిడ్డ ఎలా ఉందని కనీసం తెలుసుకునేందుకు మాట్లాడుతా మేడమ్ అంటూ బతిమిలాడినా ఫోన్ మాట్లాడించలేదని తల్లి లలిత రోదించింది. కనీసం దయ చూపకుండా హాస్టల్ టీచర్లు, సిబ్బంది తన బిడ్డ ప్రాణం తీశారని ఆరోపించింది.